🏠 aryadvi.com
Watermark
Newspaper Logo
aryadvi.com | Date: 25 Aug, 2026 | Page: 1

నీట్‌–పీజీ పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

ఆగస్టు 30న 17,627 మంది అభ్యర్థులతో 56 కేంద్రాల్లో నీట్‌–పీజీ పరీక్ష

ఎంపిక చేసిన ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ప్రాధాన్యతతో అభివృద్ధి చేసి ‘బ్రాండ్ తెలంగాణ’ను ప్రపంచస్థాయిలో బలోపేతం చేయాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, సిపి సునీల్ దత్

ఖమ్మం ప్రతినిధి, ఆగస్టు, 25:
ఆగస్టు 30న నిర్వహించనున్న నీట్‌–పీజీ 2026 ప్రవేశ పరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నీట్ పీజీ పరీక్ష ఏర్పాట్లు, పర్యాటక అభివృద్ధి పాలసీ, తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా, కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ తో కలిసి పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం లోటు వర్షపాతం నమోదైందని, వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం సెప్టెంబర్‌ చివరి వరకు పెద్దగా వర్షాలు కురిసే అవకాశం లేదని, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు, సాగునీరు, త్రాగునీటి లభ్యత, తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు.

రాష్ట్రంలోని 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాల్లో 17,627 మంది అభ్యర్థులు నీట్‌–పీజీ పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. అభ్యర్థులు నిర్దేశిత రిపోర్టింగ్ సమయానికి ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్, జనరేటర్ బ్యాకప్, వెలుతురు, వెంటిలేషన్ వంటి మౌళిక సదుపాయాలు సిద్ధంగా ఉండేలా ముందస్తు తనిఖీలు నిర్వహించాలని సీఎస్ సూచించారు. పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ కు తగిన ఏర్పాట్లు చేయడంతో పాటు అభ్యర్థుల గుర్తింపు, ఫ్రిస్కింగ్‌ను నిబంధనల ప్రకారం నిర్వహించాలని తెలిపారు.
మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, ఏఐ గ్లాసెస్, స్పై కెమెరాలు, తదితర నిషేధిత వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరాదని, ప్రశ్నాపత్రాల భద్రత, గోప్యతకు పూర్తి రక్షణ కల్పించాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్, నోడల్ అధికారుల ద్వారా పరీక్షా కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తూ అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా సంబంధిత శాఖల సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు.
తెలంగాణను దేశ, విదేశీ పర్యాటకులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా తీర్చిదిద్ది తెలంగాణను ప్రపంచస్థాయిలో బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ప్రాధాన్యతా ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని తెలిపారు.
ప్రతి జిల్లాలోని ప్రత్యేక పర్యాటక ప్రాంతాల పరిధిలో ఉన్న ఆధ్యాత్మిక, చారిత్రక, వారసత్వ, ఎకో టూరిజం, హస్తకళలు, జల పర్యాటక ప్రాంతాలను గుర్తించి, వాటిని అనుసంధానిస్తూ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని సీఎస్ ఆదేశించారు. పర్యాటక ప్రాంతాలకు రహదారులు, పార్కింగ్, త్రాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, శుభ్రత, సూచిక బోర్డులు, ఇతర సౌకర్యాలను కల్పించాలని సూచించారు.

ప్రతి ప్రత్యేక పర్యాటక ప్రాంతానికి స్పష్టమైన అభివృద్ధి కార్యాచరణ, బాధ్యతలు, కాలపరిమితి రూపొందించి పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించాలని సీఎస్ సూచించారు. స్థానిక కళలు, హస్తకళలు, స్థానిక ఆహారం, సంస్కృతికి ప్రాధాన్యత నిస్తూ స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, హోమ్‌స్టేలు, స్థానిక గైడ్ సేవలను ప్రోత్సహించాలని తెలిపారు. పర్యాటక ప్రాంతాల సహజ, చారిత్రక ప్రత్యేకతలను కాపాడుతూ పర్యావరణ హితంగా అభివృద్ధి చేయాలని, ప్రతిజిల్లాలో ఎంపిక చేసిన ప్రాంతాలను ఆకర్షణీయమైన పర్యాటక గమ్యస్థానాలుగా తీర్చిదిద్దేందుకు కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

తెలంగాణ సంస్కృతి, కళలు, హస్తకళలు, చారిత్రక వారసత్వం, స్థానిక ఆహారం, పండుగలు, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని సీఎస్ తెలిపారు. ఫెయిర్లు, ఫెస్టివల్స్, వారసత్వ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి రాష్ట్ర ప్రత్యేకతను చాటాలని సూచించారు. సమగ్ర తెలంగాణ పర్యాటక పోర్టల్, కృత్రిమ మేధ ఆధారిత ప్రయాణ ప్రణాళికలు, రియల్‌టైమ్ డేటా వ్యవస్థల ద్వారా పర్యాటకులకు సులభతరమైన సేవలు అందించాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, వ్యర్థ రహిత పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, డిఎంహెచ్ఓ డాక్టర్ రామారావు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవి బాబు, పోలీస్, నీట్ పిజీ పరీక్ష సంబంధిత అధికారులు, జిల్లా టూరిజం అధికారి సుమన్ చక్రవర్తి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home