🏠 aryadvi.com
Watermark
Newspaper Logo
aryadvi.com | Date: 25 Aug, 2026 | Page: 1

జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలి

జర్నలిస్టుల పాదయాత్రకు సీపీఎం సంఘీభావం

కారేపల్లి, ఆగస్టు 25:
టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ చేపట్టిన వైరా నియోజకవర్గ స్థాయి పాదయాత్ర మంగళవారం కారేపల్లి మండల కేంద్రంలో ప్రారంభమైంది. కారేపల్లి బస్టాండ్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమానికి సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు హాజరై పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టులు ప్రధాన భూమిక పోషిస్తున్నారని ఆయన అన్నారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వాలు, పాలకులు మారినా పరిష్కరించడంలో చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శించారు.
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్టు సోదరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే తన మొదటి లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారని గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తున్న జర్నలిస్టులకు ఇచ్చిన హామీని అమలు చేయడంలో చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు.
కారేపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలం ఉందని దానిలో ప్రజా అవసరాలు నిర్మాణం చేపడతామంటూ గత పాలకులు శిలా పలకవేసి ఏండ్లు గడిచి అవి శిథిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అట్టి స్థలాన్ని పేదలకు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు ఇళ్ల నిర్మాణానికి సహాయం, వారి పిల్లలకు ఉచిత విద్య, కుటుంబాలకు ఉచిత వైద్యం వంటి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం టీడబ్ల్యూజేఎఫ్ చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ సాధన కోసం భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలకు సీపీఎం సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.
ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో స్పందించి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కొండబోయిన నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
కారేపల్లి బస్టాండ్ సెంటర్‌లో ప్రారంభమైన పాదయాత్రకు సీపీఎం నాయకులు స్వాగతం పలికి, కామేపల్లి మండల వరకు యాత్రలో పాల్గొని వీడ్కోలు పలికారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి కే. నరేంద్ర, నాయకులు వజ్జా రామారావు, తలారి దేవప్రకాష్, మక్కా సీతారాములు, బాధావతి శ్రీనివాస్‌తో పాటు వివిధ పార్టీల నాయకులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొని సంఘీభావం తెలిపారు.
🏠 Home