🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

బుధవారం, 26 Aug 2026, 6:41 PM

QR Code

ఏఐపై బిల్ గేట్స్ హెచ్చరిక.. మానవుల ఉద్యోగాలకు పెనుముప్పు!

News Image

ఏఐపై ప్రభుత్వాలు వెంటనే నియంత్రణలు తీసుకురావాలి

భవిష్యత్‌లో కొన్ని రంగాల్లో మాత్రమే మనుషులకు ఉద్యోగాలు

ఏఐ, రోబోలతో ఉద్యోగాలు కోల్పోయేవారికి ప్రత్యేక పన్ను ద్వారా సాయం

ఏఐ దుర్వినియోగంతో జీవ, రసాయన ఆయుధాల ముప్పు

ప్రపంచవ్యాప్తంగా కఠినమైన ఏఐ నియంత్రణ ఒప్పందాలు అవసరం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తరణపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఇప్పటి నుంచే అప్రమత్తమై తగిన నిబంధనలు తీసుకురాకపోతే భవిష్యత్‌లో మానవ సమాజం తీవ్ర సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

గతంలో వచ్చిన సాంకేతిక విప్లవాలు కొత్త ఉద్యోగాలను సృష్టించాయని, అయితే ఏఐ విప్లవం పరిస్థితి భిన్నంగా ఉండవచ్చని గేట్స్ అభిప్రాయపడ్డారు. ఏఐ అభివృద్ధి కారణంగా అనేక ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని, కొన్ని ప్రత్యేక రంగాల్లో మాత్రమే మనుషుల అవసరం కొనసాగవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా ఏఐ కోడింగ్ సామర్థ్యాలు తనను ఆశ్చర్యపరిచాయని, కొన్ని పనుల్లో అది నిపుణులైన మనుషులతో పోటీపడే స్థాయికి చేరిందని వివరించారు.

ఉద్యోగాలపై ప్రభావాన్ని తగ్గించేందుకు ఏఐ, రోబోల కారణంగా సిబ్బందిని తగ్గించే కంపెనీలపై ‘రోబోట్ లేదా ఏఐ ట్యాక్స్’ విధించే ఆలోచనను గేట్స్ సూచించారు. ఆ పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉద్యోగాలు కోల్పోయిన వారికి శిక్షణ, పునరావాసం, ఇతర ఉపాధి అవకాశాల కల్పనకు ఉపయోగించవచ్చని అన్నారు.

అదే సమయంలో కొన్ని రంగాలను ‘మనుషులకు మాత్రమే’ పరిమితం చేయాల్సిన అవసరం ఉండవచ్చని సూచించారు. ఉదాహరణకు వైద్య రంగంలో రోగులకు వ్యాధి వివరాలు వివరించడం, కేర్ గివింగ్ వంటి సున్నితమైన బాధ్యతలను పూర్తిగా ఏఐకి అప్పగించకుండా మనుషులే నిర్వహించేలా నిబంధనలు తీసుకురావాలని అభిప్రాయపడ్డారు.

ఏఐని దుర్వినియోగం చేసి జీవ, రసాయన ఆయుధాలను అభివృద్ధి చేసే ప్రమాదం కూడా ఉందని గేట్స్ హెచ్చరించారు. అణ్వాయుధాలు, అంతర్జాతీయ విమానయాన రంగంలో ఉన్నట్లుగా ఏఐ వినియోగానికి కూడా అంతర్జాతీయ స్థాయిలో కఠినమైన నిబంధనలు, పర్యవేక్షణ వ్యవస్థలు, దేశాల మధ్య ఒప్పందాలు అవసరమని సూచించారు.

🏠 Home