రక్షాబంధన్ ఎప్పుడు జరుపుకోవాలి? సోదరుడికి రాఖీ కట్టేందుకు ఇదే శుభ సమయం
సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రక్షాబంధన్ పండుగ తేదీపై నెలకొన్న సందిగ్ధతకు పండితులు స్పష్టత ఇచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 28, శుక్రవారం రక్షాబంధన్ జరుపుకోవాలని సూచించారు. రాఖీ కట్టేందుకు ఉదయం వేళ శుభప్రదమైన సమయమని తెలిపారు.
హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 27 గురువారం ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 9:48 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయ సమయంలో ఉన్న తిథిని ప్రామాణికంగా తీసుకోవడం వల్ల ఆగస్టు 28న పౌర్ణమిగా పరిగణిస్తున్నట్లు పండితులు తెలిపారు.
మరోవైపు ఆగస్టు 27న ఎక్కువ సమయం భద్ర కాలం ఉండటంతో ఆ రోజున రాఖీ కట్టడం శ్రేయస్కరం కాదని పేర్కొన్నారు.
రాఖీ కట్టేందుకు శుభ సమయం
ఆగస్టు 28న ఉదయం రాఖీ కట్టేందుకు అనుకూలమైన సమయం ఉందని పండితులు తెలిపారు. ఢిల్లీలో ఉదయం 5:57 గంటల నుంచి 9:48 గంటల వరకు రాఖీ కట్టవచ్చని సూచించారు. ఇతర నగరాల్లో సూర్యోదయ సమయాలను బట్టి ముహూర్తంలో స్వల్ప మార్పులు ఉండొచ్చని.. కచ్చితమైన సమయం కోసం స్థానిక పంచాంగాన్ని పరిశీలించడం మంచిదని తెలిపారు.
చంద్రగ్రహణం ఉన్నా ఆందోళన అవసరం లేదట
ఆగస్టు 28న పాక్షిక చంద్రగ్రహణం ఉన్నప్పటికీ అది భారతదేశంలో కనిపించదని పండితులు తెలిపారు. చంద్రుడు క్షితిజం కంటే దిగువన ఉండటంతో గ్రహణం మన దేశంలో గోచరించదని పేర్కొన్నారు. దీంతో గ్రహణానికి సంబంధించిన సూతక నియమాలు వర్తించవని స్పష్టం చేశారు.
రక్షాబంధన్ సందర్భంగా సోదరీమణులు సోదరులకు తిలకం దిద్ది, హారతి ఇచ్చి రాఖీ కట్టి వారి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ఐశ్వర్యం కోసం ప్రార్థిస్తారు.