సౌత్ ఇండియన్స్ టార్గెట్గా సైబర్ మోసాలు.. స్థానిక భాషల్లో ఫోన్ కాల్స్
హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు దక్షిణాది రాష్ట్రాల ప్రజలను మోసం చేసేందుకు కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మాట్లాడే టెలీకాలర్లను నియమించుకుని స్థానిక భాషల్లో ఫోన్లు చేయిస్తున్నారు. దీంతో బాధితులు సులభంగా నమ్మేలా చేసి బ్యాంకింగ్ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించారు.
ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న మూడు నకిలీ కాల్ సెంటర్లపై ఇటీవల టీజీసీఎస్బీ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా తెలుగు మాట్లాడే 21 మంది మహిళా టెలీకాలర్లను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో నమోదైన 22 సైబర్ మోసాలతో ఈ నెట్వర్క్కు సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
ఈజీ మనీ పేరుతో వల
ఆన్లైన్ ఉద్యోగాలు, డేటా ఎంట్రీ పనులు అంటూ యువతను ఆకర్షించి టెలీకాలర్లుగా నియమించుకుంటున్నారు. జీతంతో పాటు మోసాల ద్వారా వచ్చిన డబ్బులో కమీషన్ ఇస్తామని చెప్పి వారిని నెట్వర్క్లోకి తీసుకుంటున్నారు. ముందుగానే తయారు చేసిన స్క్రిప్ట్ ప్రకారం బ్యాంకు అధికారులు, ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులుగా మాట్లాడుతూ బాధితులను నమ్మిస్తున్నారు.
బ్యాంకు పేరుతో డబ్బుల వసూలు
లోన్ ఇప్పిస్తామని చెప్పి ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫికేషన్ ఛార్జీలు, డాక్యుమెంటేషన్ ఫీజు, బీమా వంటి పేర్లతో డబ్బులు వసూలు చేస్తున్నారు. కొందరిని బ్యాంకు అధికారులు, ఆర్బీఐ లేదా ఇతర దర్యాప్తు సంస్థల పేరుతో బెదిరించి కూడా నగదు బదిలీ చేయించుకుంటున్నారు.
ఇటీవల ఓ 85 ఏళ్ల రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగిని ఎన్ఐఏ పేరుతో భయపెట్టి రూ.85.20 లక్షలు కాజేశారు. మరో రూ.42 లక్షలు అడగడంతో అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తులో ఫోన్ చేసిన మహిళ తెలుగులో మాట్లాడినట్లు గుర్తించిన అధికారులు, కోయంబత్తూరులోని బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.85.20 లక్షలను ఫ్రీజ్ చేశారు.
స్థానిక భాషలో మాట్లాడుతున్నారనే కారణంతో ఫోన్ చేసిన వ్యక్తిని బ్యాంకు లేదా ప్రభుత్వ అధికారి అని నమ్మవద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.