🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

శనివారం, 29 Aug 2026, 6:42 PM

QR Code

ఏఐ సాయంతో అరుదైన బ్రెయిన్‌ సర్జరీ.. విజయవంతంగా కోలుకున్న 48 ఏళ్ల వ్యక్తి

News Image

యూకే: వైద్య రంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వినియోగం రోజురోజుకూ విస్తరిస్తోంది. వ్యాధుల గుర్తింపు, స్కానింగ్‌ రిపోర్టుల విశ్లేషణ, మందుల మోతాదును నిర్ణయించడం వంటి అనేక అంశాల్లో ఏఐ కీలకంగా మారుతోంది. తాజాగా ఏఐ సాయంతో ఓ అరుదైన మెదడు శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు.

యూకేకు చెందిన 48 ఏళ్ల రిస్‌ హిబ్బర్ట్‌ ఓ రోజు నడుచుకుంటూ వెళ్తుండగా హఠాత్తుగా స్పృహ కోల్పోయారు. అనంతరం ఆయనకు మూర్ఛ వచ్చింది. వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. పిట్యుటరీ గ్రంథి సమీపంలో 11 మి.మీ. పరిమాణంలో కణితి ఉన్నట్లు గుర్తించారు.

ఆ కణితి క్యాన్సర్‌ కాదని తేలినప్పటికీ.. అది చూపుపై ప్రభావం చూపుతున్నట్లు వైద్యులు గుర్తించారు. దాన్ని తొలగించకపోతే భవిష్యత్తులో పూర్తిగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని నిర్ధారించారు. అలాగే రిస్‌ హిబ్బర్ట్‌ స్వల్పంగా పనిచేసినా త్వరగా అలసటకు గురయ్యేవారు.

ఏఐ ఎలా ఉపయోగపడింది?

వైద్యులు ఎండోస్కోప్‌ ద్వారా అందిన లైవ్‌ సర్జరీ వీడియోను ఏఐ సాయంతో విశ్లేషించారు. శస్త్రచికిత్స సమయంలో మెదడులోని రక్తనాళాలు, నరాలను గుర్తించడంలో ఏఐ వైద్యులకు సహాయపడింది. దీంతో వాటికి ఎలాంటి నష్టం కలగకుండా సంక్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.

ఈ శస్త్రచికిత్స మే నెలలోనే జరిగినప్పటికీ.. పేషెంట్‌ పూర్తిగా కోలుకునే వరకు వైద్యులు వివరాలను వెల్లడించలేదు. ప్రస్తుతం రిస్‌ హిబ్బర్ట్‌ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. తాజాగా ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించడంతో ఏఐ సాయంతో జరిగిన ఈ అరుదైన బ్రెయిన్‌ సర్జరీ వెలుగులోకి వచ్చింది.

🏠 Home