ఎవరెస్ట్ ఇంగువపై నిషేధం.. నాణ్యత లోపాలపై FSSAI చర్యలు
ముంబై: ప్రముఖ మసాలా తయారీ సంస్థ ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్కు చెందిన ఇంగువ ఉత్పత్తిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు నిషేధం విధించారు. సంస్థ తయారు చేస్తున్న కొన్ని మసాలా ఉత్పత్తుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని గుర్తించిన అధికారులు నోటీసులు జారీ చేశారు.
వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఎవరెస్ట్ సంస్థకు చెందిన ఉత్పత్తుల నమూనాలను అధికారులు సేకరించి ప్రయోగశాలలో పరీక్షించారు. ఈ పరీక్షల్లో ఇంగువతో పాటు గరం మసాలా, చికెన్ మసాలా, ఎగ్ కర్రీ మసాలా ఉత్పత్తుల్లోనూ నాణ్యతకు సంబంధించిన లోపాలు ఉన్నట్లు గుర్తించారు.
కొన్ని ఉత్పత్తుల ప్యాకెట్లపై ఉప్పు శాతం, మసాలా దినుసుల అసలు కంటెంట్ వంటి వివరాలను నిబంధనల ప్రకారం స్పష్టంగా పేర్కొనలేదని అధికారులు తెలిపారు. అలాగే కొన్ని నమూనాల్లో స్టార్చ్ పరిమాణం ఎక్కువగా ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైంది.
నాణ్యతా ప్రమాణాలను పూర్తిస్థాయిలో పాటించే వరకు సంబంధిత ఉత్పత్తులపై ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. లోపాలను సరిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సమర్పించాలని ఎవరెస్ట్ సంస్థను ఆదేశించారు.
లాల్జీ గోధూపైనా చర్యలు
ఎవరెస్ట్తో పాటు ప్రముఖ ఇంగువ తయారీ సంస్థ లాల్జీ గోధూ అండ్ కంపెనీపై కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆ సంస్థకు చెందిన ఇంగువ నమూనాల్లో నాణ్యతా లోపాలతో పాటు అధికంగా స్టార్చ్ ఉన్నట్లు పరీక్షల్లో తేలడంతో విక్రయాలపై నిషేధం విధించారు.
నిబంధనలకు అనుగుణంగా నాణ్యతను మెరుగుపరిచి, లోపాలను సరిదిద్దిన తర్వాతే ఉత్పత్తుల విక్రయాలకు అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.