🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

సోమవారం, 31 Aug 2026, 12:54 AM

QR Code

పవర్‌ బ్యాంక్‌తో ఆటలొద్దు.. ప్రాణాలకే ముప్పు!

News Image

పవర్‌ బ్యాంక్‌ పేలుళ్లతో అప్రమత్తం కావాల్సిన పరిస్థితి

నాసిరకం బ్యాటరీలు, అధిక వేడి, తప్పు ఛార్జింగ్‌ విధానాలే ప్రధాన కారణాలు

మొబైల్‌ ఫోన్‌కు అత్యవసర సమయంలో ఛార్జింగ్‌ అందించే పవర్‌ బ్యాంక్‌ ఇప్పుడు చాలామందికి నిత్యావసర పరికరంగా మారింది. అయితే నిర్లక్ష్యంగా ఉపయోగిస్తే అదే పరికరం ప్రమాదకరంగా మారొచ్చు. లిథియం-అయాన్‌ బ్యాటరీల్లో లోపాలు, నాసిరకం ఉత్పత్తులు, తప్పు ఛార్జింగ్‌ పద్ధతుల కారణంగా పవర్‌ బ్యాంక్‌లు పేలుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

ఇటీవల సూరత్‌కు చెందిన ఓ మహిళ పవర్‌ బ్యాంక్‌ను ఛార్జింగ్‌కు పెట్టి బయటకు వెళ్లింది. తిరిగి వచ్చేలోపు అది పేలడంతో గది మొత్తం కాలిపోయింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. మరో ఘటనలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ బాలుడు వాడిపడేసిన పవర్‌ బ్యాంక్‌ను జేబులో పెట్టుకుని వెళ్తుండగా అది పేలి తీవ్రంగా గాయపడ్డాడు.

పేలుడుకు ప్రధాన కారణాలివే..

నాణ్యత లేని బ్యాటరీ సెల్స్‌లో షార్ట్‌సర్క్యూట్‌ జరిగితే వేడి వేగంగా పెరిగి పేలుడు సంభవించవచ్చు.

ఎండలో, కారులో లేదా దిండు, దుప్పటి కింద పవర్‌ బ్యాంక్‌ను ఛార్జ్‌ చేయడం ప్రమాదకరం.

కిందపడటం, బలంగా ఢీకొనడం వల్ల బ్యాటరీ లోపల నష్టం జరిగే అవకాశం ఉంటుంది.

నాసిరకం ఛార్జర్‌, కేబుల్‌ వాడితే అధిక కరెంట్‌, వేడి ఉత్పత్తి కావచ్చు.

పవర్‌ బ్యాంక్‌ను నెలల తరబడి పూర్తిగా ఖాళీగా ఉంచడం వల్ల బ్యాటరీ సామర్థ్యం దెబ్బతినొచ్చు.

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆపేయండి!

విపరీతంగా వేడెక్కడం • బ్యాటరీ ఉబ్బడం • ఆకారం మారడం • కాలిన వాసన రావడం • పొగ రావడం • అసాధారణ శబ్దాలు రావడం • పగుళ్లు లేదా లీకేజీ కనిపించడం • ఛార్జింగ్‌ పదేపదే ఆగిపోవడం

ఇలాంటి లక్షణాలు కనిపించిన పవర్‌ బ్యాంక్‌ను మళ్లీ ఛార్జ్‌ చేయకూడదు. స్వయంగా తెరిచి మరమ్మతు చేయడం కూడా ప్రమాదకరం.

ఇలా చేస్తే సురక్షితం..

నాణ్యమైన, నమ్మకమైన బ్రాండ్‌ పవర్‌ బ్యాంక్‌ను మాత్రమే కొనుగోలు చేయాలి.

అనుమానాస్పదంగా తక్కువ ధర ఉన్న ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.

తయారీదారు సూచించిన ఛార్జర్‌, కేబుల్‌నే ఉపయోగించాలి.

దుప్పటి, దిండు, సోఫా వంటి వేడిని గ్రహించే వస్తువులపై పెట్టి ఛార్జ్‌ చేయకూడదు.

కారు డ్యాష్‌బోర్డ్‌, మూసివేసిన వాహనం వంటి అధిక ఉష్ణోగ్రత ప్రదేశాల్లో ఉంచకూడదు.

పిల్లలు పవర్‌ బ్యాంక్‌తో ఆడకుండా చూడాలి.

ఎత్తు నుంచి పడిపోయిన లేదా బలంగా ఢీకొన్న పవర్‌ బ్యాంక్‌ను వెంటనే ఛార్జ్‌ చేయకుండా నిపుణులతో తనిఖీ చేయించాలి.

నీరు తగలకుండా జాగ్రత్తపడాలి.

ఫోన్‌ ఛార్జ్‌ కాకపోతే..

పవర్‌ బ్యాంక్‌లో ఛార్జ్‌ ఉందో లేదో ముందుగా పరిశీలించాలి. తర్వాత కేబుల్‌ను మార్చి చూడాలి. మరో అవుట్‌పుట్‌ పోర్టు ఉంటే దానితో పరీక్షించవచ్చు. అయినా పనిచేయకపోతే పవర్‌ బ్యాంక్‌ను తెరిచి పరిశీలించకుండా సర్వీస్‌ సెంటర్‌ను సంప్రదించాలి.

పవర్‌ బ్యాంక్‌ బ్యాకప్‌ క్రమంగా తగ్గడం బ్యాటరీ సామర్థ్యం తగ్గిన సంకేతం కావచ్చు. పాత బ్యాటరీని స్వయంగా మార్చడం ప్రమాదకరం. బ్యాటరీ లేదా సర్క్యూట్‌లో లోపం ఉన్నట్లు అనిపిస్తే అర్హత కలిగిన టెక్నీషియన్‌ను సంప్రదించడం ఉత్తమం.

🏠 Home