హైదరాబాద్లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం!
మోదీ స్టేడియాన్ని మించేలా నిర్మాణం.. 100 ఎకరాల్లో భారీ క్రీడా ప్రాంగణం
హైదరాబాద్: తెలంగాణ రాజధానికి మరో భారీ క్రీడా మణిహారం రానుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలతో అధికారులు ఇప్పటికే అనువైన స్థలం కోసం అన్వేషణ ప్రారంభించారు. ప్రణాళిక ప్రకారం ఈ ఏడాది డిసెంబర్లో స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియం 1.32 లక్షల సీట్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఉంది. దీనిని మించే సామర్థ్యంతో కొత్త స్టేడియాన్ని నిర్మించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందుకోసం సుమారు 100 ఎకరాల స్థలాన్ని కేటాయించనుండగా, నిర్మాణం, నిర్వహణ వ్యయాలను బీసీసీఐ భరించనుంది.
రవాణాకు అనుకూలంగా స్థలం
స్టేడియం కోసం ఔటర్ రింగ్ రోడ్డు, ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు మార్గం, శంషాబాద్ విమానాశ్రయానికి చేరువలో ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రేక్షకులకు రవాణా సౌకర్యం మెరుగ్గా ఉండనుంది.
మల్టీపర్పస్ వేదికగా..
కేవలం క్రికెట్ మ్యాచ్లకే పరిమితం కాకుండా ఫుట్బాల్ పోటీలు, అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లు, భారీ సంగీత కచేరీలు నిర్వహించుకునేలా స్టేడియాన్ని మల్టీపర్పస్ వేదికగా తీర్చిదిద్దనున్నారు. ఫ్యూచర్ సిటీలో ప్రతిపాదిత స్పోర్ట్స్ సిటీ, టూరిజం, నెట్ జీరో సిటీ కాన్సెప్ట్లో ఈ స్టేడియం ప్రధాన ఆకర్షణగా నిలిచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.