🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 31 August 2026, 6:01 pm Posted by : ARYADVI NEWS

వెలిగొండపై రాజకీయ వేడి.. జగన్ వ్యాఖ్యలకు లోకేశ్ కౌంటర్

News Image
అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం నేపథ్యంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య రాజకీయ విమర్శలు ముదిరాయి. ప్రాజెక్టు నిర్మాణ ఘనతపై మాజీ సీఎం వైఎస్ జగన్, మంత్రి నారా లోకేశ్ పరస్పరం విమర్శలు చేసుకున్నారు.

వెలిగొండ ప్రాజెక్టును తమ హయాంలోనే కీలక దశకు తీసుకెళ్లామని జగన్ చేసిన వ్యాఖ్యలపై లోకేశ్ స్పందించారు. 2024లో వైసీపీ ప్రభుత్వం నీరు అందుబాటులోకి రాకముందే ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసిందని ఆయన ఆరోపించారు. అప్పట్లో సొరంగాల పనులు పూర్తయ్యాయని చెబుతూ నిర్వహించిన కార్యక్రమంలో వాస్తవంగా నీటి ప్రవాహం లేదని విమర్శించారు.

తాజాగా తన ఎక్స్ ఖాతాలో లోకేశ్ పలు ఫొటోలను పోస్టు చేస్తూ.. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తున్న దృశ్యాలను, గతంలో జరిగిన ప్రారంభోత్సవాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ప్రాజెక్టు ద్వారా నిజంగా నీటిని నల్లమల సాగర్‌లోకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు.

అయితే వెలిగొండ ప్రాజెక్టు విషయంలో జగన్ భిన్నమైన వాదన వినిపించారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టుకు పునాది పడిందని, తన ప్రభుత్వంలో కీలకమైన సొరంగాల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. టీడీపీ గత పాలనలో పనులు ఆశించిన వేగంతో జరగలేదని విమర్శించారు.

ఈ నేపథ్యంలో సోమవారం సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించి నల్లమల సాగర్‌లోకి కృష్ణా జలాలను విడుదల చేయడంతో ప్రాజెక్టు మరోసారి రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. తొలి విడతలో 10.7 టీఎంసీల నీటిని విడుదల చేశారు. దీంతో ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు సాగు, తాగునీటి ప్రయోజనం కలగనుంది. సుమారు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందే అవకాశం ఉంది.
🏠 Home