🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 31 August 2026, 6:14 pm Posted by : ARYADVI NEWS

నష్టాలతో ముగిసిన మార్కెట్లు.. 24,100 దిగువకు నిఫ్టీ

News Image
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ పరిణామాలు ప్రతికూలంగా ఉండటంతో పాటు ఐటీ, మెటల్, రియల్టీ, మీడియా రంగాల్లో అమ్మకాల ఒత్తిడి సూచీలను కిందికి లాగింది.

రోజు ముగిసే సమయానికి సెన్సెక్స్ 307.24 పాయింట్లు కోల్పోయి 76,957.27 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 95.25 పాయింట్లు తగ్గి 24,080.40 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, ఎటర్నల్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.

రంగాల వారీగా చూస్తే ఐటీ, మెటల్, రియల్టీ, మీడియా సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీనికి భిన్నంగా ఆటో, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగాలు కొంత మద్దతు ఇచ్చాయి. మిడ్‌క్యాప్ సూచీ 0.24 శాతం పెరగగా, స్మాల్‌క్యాప్ సూచీ 0.74 శాతం దిగజారింది.

మార్కెట్ తదుపరి కదలికలపై విశ్లేషకులు అప్రమత్తత అవసరమని సూచిస్తున్నారు. నిఫ్టీ 24,180–24,200 స్థాయుల వైపు పుంజుకునే అవకాశం ఉన్నప్పటికీ, అక్కడ అమ్మకాల ఒత్తిడి ఎదురయ్యే అవకాశముందని చెబుతున్నారు. 24,200 పైన నిలదొక్కుకుంటే మరో 100 పాయింట్ల వరకు లాభపడే అవకాశం ఉండగా.. 23,990 స్థాయి కీలక మద్దతుగా ఉంటుందని అంచనా.

ఇదిలా ఉండగా అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. దౌత్యపరమైన పరిష్కారంపై అనిశ్చితి నేపథ్యంలో ముడి చమురు ధరలు, ప్రపంచ బాండ్ ఈల్డ్స్ పెరగడం మదుపరుల్లో ఆందోళనకు కారణమైంది. అధిక ఇంధన వ్యయాలు, వడ్డీ రేట్ల ప్రభావం కంపెనీల లాభాలపై పడే అవకాశం ఉందన్న భయాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
🏠 Home