🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

సోమవారం, 31 Aug 2026, 6:48 PM

QR Code

‘పుట్టింటి నుంచే నన్ను బయటకు పంపారు’.. సభలో కన్నీళ్లు పెట్టుకున్న కవిత

News Image

బీఆర్ఎస్‌ నుంచి సస్పెన్షన్‌పై భావోద్వేగం.. కొత్త పార్టీ ఎందుకు పెట్టానో వివరించిన నేత

నిజామాబాద్‌: బీఆర్ఎస్‌ నుంచి తనను సస్పెండ్‌ చేయడంపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నిజామాబాద్‌లో నిర్వహించిన పాంచజన్య సభలో ప్రసంగిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ కోసం తాను జైలుకు వెళ్లానని పెద్ద నాయకులే చెప్పారని, కానీ చివరకు అదే పార్టీ నుంచి తనను బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు.

“నాతో ఎందుకు ఇలా చేయాలి?” అంటూ కవిత కన్నీళ్లు పెట్టుకోవడంతో సభలోని మహిళలు, కార్యకర్తలు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. కార్యకర్తలు “కవిత సీఎం.. సీఎం” అంటూ నినాదాలు చేశారు.

పుట్టింటి ఆదరణ దక్కలేదంటూ..

సొంతంగా పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారి నిజామాబాద్‌కు వచ్చిన కవిత.. తన రాజకీయ నిర్ణయాలకు కారణాలను వివరించారు. తెలంగాణలో ఇంకా అనేక సమస్యలను పరిష్కరించాల్సి ఉందని, ప్రజల కోసం పనిచేయాలనే ఉద్దేశంతోనే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేశానని తెలిపారు.

తాను ఆరు నెలలు జైలులో ఉండి తిరిగి వచ్చిన సమయంలో పుట్టింటి నుంచి ఆదరణ లభించలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తన అత్తమామలు మాత్రం ఎలాంటి ప్రశ్నలు వేయకుండా కన్నబిడ్డలా చూసుకున్నారని చెప్పారు.

ఎన్నికల్లో సమాధానం చెబుతా

తాను ఎలాంటి తప్పు చేయకపోయినా తీహార్‌ జైలుకు పంపారని కవిత ఆరోపించారు. తనను జైలుకు పంపిన వారికి రాబోయే ఎన్నికల్లో ప్రజల తీర్పుతో సమాధానం ఇస్తామని అన్నారు.

రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కొత్త రాజకీయ శక్తి అవసరమని పేర్కొన్న ఆమె.. తెలంగాణ రక్షణ సేనకు ప్రజలు అండగా నిలవాలని కోరారు.

కాళేశ్వరంపై ప్రశ్నలు

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్‌ జిల్లాలో కనీసం ఒక్క ఎకరానికైనా నీరు అందిందా? అని కవిత ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయని వారిని ప్రశ్నించడంలో బీఆర్ఎస్‌ ఎందుకు వెనుకడుగు వేస్తోందని నిలదీశారు.

తాను “నిప్పులాంటి నిజామాబాద్‌ బిడ్డను” అని పేర్కొన్న కవిత.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

🏠 Home