హైదరాబాద్కు కొత్త రూపు.. GHMC, CMC, MMC కొత్త లోగోలు ఆవిష్కరణ
మూడు కార్పొరేషన్లకు ప్రత్యేక గుర్తింపు.. లోగోలను విడుదల చేసిన సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిని మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా పునర్వ్యవస్థీకరించిన నేపథ్యంలో వాటికి కొత్త గుర్తింపును తీసుకొచ్చారు. GHMC, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC)లకు రూపొందించిన కొత్త లోగోలను సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించారు. మూసారాంబాగ్ బ్రిడ్జి ప్రారంభోత్సవం అనంతరం ఈ కార్యక్రమం జరిగింది.
గ్రేటర్ హైదరాబాద్ను మూడు కార్పొరేషన్లుగా విభజించడంతో పాటు.. ఒక్కో సంస్థకు ప్రత్యేక అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ (CURE)గా పరిగణిస్తూ పాత GHMCని పునర్విభజించారు.
GHMC పరిధి
కొత్త GHMCలో సుమారు 70 లక్షల జనాభాతో 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 డివిజన్లు ఉంటాయి. శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, ఖైరతాబాద్, గోల్కొండ, సికింద్రాబాద్ జోన్లుగా విభజించారు. ప్రస్తుతం GHMC పరిధి సుమారు 689 చదరపు కిలోమీటర్లుగా ఉంది.
CMCలో 3 జోన్లు
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు ఉన్నాయి. మొత్తం 16 సర్కిళ్లు, 76 డివిజన్లతో ఈ కార్పొరేషన్ ఏర్పాటైంది. సుమారు 613 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న CMCకి తొలి కమిషనర్గా ఐఏఎస్ అధికారి సృజనను నియమించారు.
MMCలోనూ మూడు జోన్లు
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లో మల్కాజిగిరి, ఎల్బీనగర్, ఉప్పల్ జోన్లు ఉన్నాయి. ఇందులో 14 సర్కిళ్లు, 74 డివిజన్లు ఉండగా.. కార్పొరేషన్ విస్తీర్ణం సుమారు 654 చదరపు కిలోమీటర్లు. తొలి కమిషనర్గా ఐఏఎస్ అధికారి టి. వినయ్ కృష్ణారెడ్డిని నియమించారు.
మూడు కార్పొరేషన్లకు ప్రత్యేక లోగోలను రూపొందించడం ద్వారా పరిపాలనా విభజనకు కొత్త గుర్తింపును కల్పించినట్లు ప్రభుత్వం తెలిపింది.