🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

సోమవారం, 31 Aug 2026, 7:05 PM

QR Code

ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి... స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ

News Image

ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్లు

ఖమ్మం ప్రతినిధి: ఆగస్టు 31:

ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ జిల్లా అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఖమ్మం జిల్లా కమిటీ కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు జిల్లాలో ఉన్న విద్య, వైద్య, ఇతర అంశాలను సూచిస్తూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించగా, జిల్లా పరిధిలో సంబంధిత సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ తెలిపారు.

కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామ పంచాయతీకి చెందిన సంతోష్ లకావత్ గ్రామంలో ప్రత్యేక అధికారి పాలన కాలంలో సుమారు 9 లక్షల రూపాయల వరకు జరిగిన బిల్లుల చెల్లింపులపై సమగ్ర విచారణ, ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, డిప్యూటీ సీఈఓ ఖమ్మంకు రాస్తూ సెప్టెంబర్ 9 నాటికి విచారణ జరిపి రిపోర్టు సమర్పించాల్సిందిగా అదనపు కలెక్టర్ ఆదేశించారు.

కల్లూరు మండలం తాళ్లూరి వెంకటాపురం గ్రామానికి చెందిన పాశం నాగేశ్వరరావు తన కుమార్తె పాశం ప్రియమణిని లంకపల్లి బిసి గురుకులం నుంచి రెబ్బవరం బీసీ గురుకులం పాఠశాలకు మార్చాల్సిందిగా కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఆర్సిఓ బిసి సంక్షేమ అధికారికి రాస్తూ చర్యలు తీసుకోవాలని అన్నారు.

తిరుమలాయపాలెం మండలం తాళ్లచెరువు గ్రామానికి చెందిన జోగుపర్తి బుచ్చమ్మ తన భర్త మరణించిన తర్వాత తనకు తెలియకుండా భర్త పేరు మీద ఉన్న ఆరు ఎకరాల 30 గుంటల భూమి తన కుమారుడు, కోడలు వారి పేరు మీద పాస్ పుస్తకం చేయించుకున్నారని, ఇప్పుడు తన సంరక్షణకు కూడా ఎటువంటి సహాయం చేయడం లేదని తన పోషణ పరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా సంక్షేమ అధికారికి రాస్తూ సీనియర్ సిటిజన్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ కె. శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.

🏠 Home