🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 31 August 2026, 7:19 pm Posted by : ARYADVI NEWS

నీళ్లు లేకుండా 40 ఏళ్లుగా వ్యవసాయం.. అమెరికా రైతు అద్భుతం!

News Image
అమెరికాలోని ఒరెగాన్‌కు చెందిన ఓ రైతు నీటి చుక్క కూడా ఉపయోగించకుండా ఏకంగా 40 ఏళ్ల పాటు వ్యవసాయం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. భూమిలో సహజంగా నిల్వ ఉండే తేమను మాత్రమే ఆధారంగా చేసుకుని టమాటాలు, బంగాళదుంపలు, వెల్లుల్లి, గుమ్మడి వంటి పలు రకాల పంటలను విజయవంతంగా సాగు చేశారు. 1974 నుంచి 2014 వరకు ఆయన ఈ విధానంలో వ్యవసాయం కొనసాగించారు.

2007లో ఒరెగాన్‌లోని వెనెటా సమీపంలో 9.6 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన ఆయనకు ఆ భూమిపై ఎలాంటి సాగునీటి హక్కులు లేవు. అయినప్పటికీ తన కుటుంబ అవసరాలకు సరిపడా ఆహారాన్ని పండించడంతో పాటు, అదనపు దిగుబడిని స్థానిక మార్కెట్లలో విక్రయించారు. ఈ విధానాన్ని ‘డ్రై ఫార్మింగ్’గా పిలుస్తారు.
ఈ సాగు విధానంలో నేల తయారీకి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. వసంతకాలంలో నేలలో తేమ ఉన్నప్పుడు దుక్కి దున్ని, ఆ తేమ ఆవిరైపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. పంటలు నాటిన తర్వాత నేల పైపొరను 4 నుంచి 6 అంగుళాల వరకు వదులుగా ఉంచడం వల్ల వేర్లు లోతుగా వెళ్లి తేమను గ్రహించేందుకు అవకాశం ఉంటుంది.
మొక్కల మధ్య తగినంత దూరం పాటించడం వల్ల నీటి కోసం పోటీ తగ్గుతుంది. కరవును తట్టుకునే వంగడాలను ఎంచుకోవడం, సేంద్రియ ఎరువులను ఉపయోగించడం కూడా ఈ విధానంలో కీలకమైన అంశాలు.
అయితే ఇసుక నేలలు, తక్కువ లోతు ఉన్న భూములకు డ్రై ఫార్మింగ్ అనుకూలంగా ఉండదని నిపుణులు చెబుతున్నారు. నీటి కొరత, అధిక సాగు వ్యయం, సాగునీటి హక్కుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు మాత్రం సరైన భూమి, పంట ఎంపికతో ఈ విధానం మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే అవకాశం ఉంది.
🏠 Home