వెలిగొండ ప్రాజెక్టుతో కూటమి సంకల్ప బలం చాటాం: పవన్ కల్యాణ్
అమరావతి: కూటమి ప్రభుత్వం ఏదైనా సంకల్పిస్తే దాన్ని ఎలా సాకారం చేస్తుందో వెలిగొండ ప్రాజెక్టు పూర్తే నిదర్శనమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రస్తుతం కేరళలో ఉన్న ఆయన.. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించి జాతికి అంకితం చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో స్పందించారు. 30 ఏళ్ల ప్రజల కలను వెలిగొండ ప్రాజెక్టు సాకారం చేసిందని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ప్రజలు అధికారం అప్పగించారని.. వాటిని నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పవన్ తెలిపారు. వెలిగొండ తొలి దశ పూర్తవడంతో కృష్ణా జలాలు కరవు పీడిత ప్రాంతాలకు చేరనున్నాయని, ఇది చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు.
వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో సాగు భూములకు జలకళ వస్తుందని, కరవు నేలల్లో ఆశలు చిగురిస్తాయని అన్నారు. ప్రజలకు స్థానికంగానే ఉపాధి, వ్యవసాయ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. తొలి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందనున్నట్లు పవన్ వివరించారు.
పరిశ్రమలపై కూడా పవన్ సూచనలు
రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి పవన్ కల్యాణ్ మరో పోస్టు చేశారు. పారిశ్రామికవేత్తలు విజ్ఞులని, పర్యావరణ పరిరక్షణపై వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. పర్యావరణానికి హాని కలిగించేలా పరిశ్రమలు వ్యవహరించకూడదని స్పష్టం చేశారు.
అనుమతులు తీసుకోకుండా పరిశ్రమలు నిర్వహించడం, కాలం చెల్లిన అనుమతులను పునరుద్ధరించుకోకుండా కొనసాగించడం సరికాదన్నారు. ప్రతి పరిశ్రమ 33 శాతం పచ్చదనాన్ని పాటించాలని సూచించారు. భవిష్యత్ తరాలకు పచ్చని వాతావరణాన్ని అందించేందుకు పరిశ్రమలు సహకరించాలని కోరారు. భారీ, మధ్యతరహా పరిశ్రమల్లో 33 శాతం పచ్చదనం పెంచేలా చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలిని పవన్ కల్యాణ్ ఆదేశించారు.