కేసీఆర్ పాలనపై రేవంత్ ఫైర్.. ‘‘పదేళ్లలో చేయనిది రెండేళ్లలో చేశాం’’
హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై సీఎం రేవంత్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పలు పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో పూర్తి చేసిందని అన్నారు. హైదరాబాద్లోని అంబర్పేట–మూసారాంబాగ్ మధ్య మూసీ నదిపై నిర్మించిన నూతన వంతెనను సోమవారం సీఎం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్రెడ్డి.. వర్షాలు కురిసిన ప్రతిసారీ నీట మునిగే పాత వంతెన స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణంపై గత ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టలేదని ప్రశ్నించారు. అంబర్పేటలో ప్రజలకు అవసరమైన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణంతో పాటు 10 ఎకరాల స్థలంలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు.
బతుకమ్మ కుంటను ఆక్రమించే ప్రయత్నాల వెనుక ఉన్న వ్యక్తులు, వారి అండదండలను ప్రజలు గుర్తించాలని సీఎం సూచించారు. చెరువులు, జలవనరులను కాపాడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలా చెరువుల భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం లేదన్నారు.
కేసీఆర్పై అప్పుల ఆరోపణలు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టే నాటికి ఖజానా పరిస్థితి దారుణంగా ఉందని రేవంత్రెడ్డి ఆరోపించారు. గతంలో ఉద్యోగులకు నెల మొదటి వారంలో కూడా జీతాలు అందని పరిస్థితి ఉండేదని అన్నారు. ప్రస్తుతం ప్రతి నెలా మొదటి తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ చేస్తున్నామని తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన పలువురు ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పులతో పోలిస్తే.. కేసీఆర్ హయాంలో రాష్ట్ర అప్పులు భారీగా పెరిగాయని సీఎం ఆరోపించారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని రూ.8.11 లక్షల కోట్ల అప్పుల భారంలోకి నెట్టారని విమర్శించారు.
తమ ప్రభుత్వంపై గతంలో విమర్శలు చేసిన ఉద్యోగులే ఇప్పుడు పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ పనితీరుతో ప్రస్తుత పాలనను పోల్చి చూడాలని ఉద్యోగులను కోరారు. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని సీఎం వివరించారు.