ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ వ్యవహారం.. ఎంఐఎంకు కొత్త చిక్కులు!
హైదరాబాద్: ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ వ్యవహారం ఎంఐఎం పార్టీలో కలకలం రేపుతోంది. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆయన.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి నిరాకరిస్తున్నట్లు సమాచారం. పార్టీ ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదన్న ప్రచారం నేపథ్యంలో తదుపరి చర్యలపై మజ్లిస్ నాయకత్వం దృష్టి పెట్టింది.
రహ్మత్ బేగ్‌పై లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తనకు సంబంధించినదిగా చెబుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మొదలైంది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఎంఐఎం అధిష్ఠానం ఆయనపై చర్యలు తీసుకుంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించడంతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, ఆ లేఖను శాసనమండలి చైర్మన్‌కు అందజేయాలని ఆదేశించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఆరోపణలను ఖండించిన బేగ్
అయితే తనపై వచ్చిన ఆరోపణలను రహ్మత్ బేగ్ ఖండిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వీడియో మార్ఫింగ్ లేదా డీప్‌ఫేక్ అయి ఉండొచ్చని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. కొందరు తనను బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ గతంలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. ఉమ్రా యాత్ర నిమిత్తం సౌదీ అరేబియాలో ఉన్న రహ్మత్ బేగ్‌ను వివాదం నేపథ్యంలో హైదరాబాద్‌కు పిలిపించినట్లు సమాచారం. అనంతరం పార్టీ నేతలు ఆయన నుంచి రాజీనామా లేఖ తీసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన ఆచూకీపై స్పష్టత లేదని స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఎమ్మెల్సీ పదవిపైనే పట్టు?
పార్టీ నుంచి బహిష్కరించినా ఎమ్మెల్సీగా కొనసాగాలని రహ్మత్ బేగ్ నిర్ణయించుకున్నట్లు వస్తున్న వార్తలు ఎంఐఎం నాయకత్వానికి ఇబ్బందికరంగా మారాయి. సాధారణంగా పార్టీ అధిష్ఠానం నిర్ణయాలకు ప్రాధాన్యం ఇచ్చే మజ్లిస్‌లో ఓ ఎమ్మెల్సీ ఆదేశాలను ధిక్కరించడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు ఈ వ్యవహారంపై బీజేపీ కూడా స్పందించింది. ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపి, తప్పు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మైనర్‌కు సంబంధించిన ఆరోపణలు ఉన్నందున విచారణ పారదర్శకంగా జరగాలని కోరింది.
డ్రైవర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి మజ్లిస్‌లో కీలక స్థాయికి ఎదిగిన రహ్మత్ బేగ్.. ప్రస్తుతం తీవ్ర ఆరోపణల కారణంగా పార్టీకి దూరమయ్యే పరిస్థితి రావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, దానిపై వచ్చిన ఆరోపణల వాస్తవికతపై దర్యాప్తు పూర్తయ్యే వరకు తుది నిర్ధారణకు రావడం సరికాదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.