🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

సోమవారం, 31 Aug 2026, 10:57 PM

QR Code

ఫోన్‌ IMEI మార్చితే ఇక కఠిన చర్యలు.. మూడేళ్ల జైలు, రూ.50 లక్షల జరిమానా!

News Image

మొబైల్‌ IMEI నంబర్‌ను ట్యాంపరింగ్ చేస్తే కఠిన చర్యలు

నిబంధనలు ఉల్లంఘిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష

రూ.50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం

IMEI మార్పుల నేరం బెయిల్‌ లేని కేసుగా పరిగణన

ఇతరుల సిమ్‌ కార్డులను వినియోగానికి ఇవ్వొద్దని కేంద్రం హెచ్చరిక

‘సంచార్‌ సాథి’ ద్వారా ఫోన్‌ వివరాలను తనిఖీ చేసుకోవాలని సూచన

న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్‌లోని IMEI నంబర్‌ను మార్చడం, తారుమారు చేయడం లేదా అలాంటి పరికరాలను వినియోగించడంపై కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. టెలికమ్యూనికేషన్స్ చట్టం–2023 ప్రకారం ఇలాంటి చర్యలకు పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని టెలికమ్యూనికేషన్స్ శాఖ స్పష్టం చేసింది.

మొబైల్, డిజిటల్ సేవల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో టెలికాం ఐడెంటిఫైయర్ల దుర్వినియోగాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ నిబంధనలను అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చట్టంలోని సెక్షన్ 42(3)(c) ప్రకారం IMEIతో పాటు ఇతర టెలికమ్యూనికేషన్ ఐడెంటిఫైయర్లను అక్రమంగా మార్చడం నిషేధం.

బెయిల్ కూడా అంత సులభం కాదు

IMEI ట్యాంపరింగ్‌కు సంబంధించిన నేరాన్ని కాగ్నిజబుల్, నాన్-బెయిలబుల్ నేరంగా పరిగణిస్తామని కేంద్రం వెల్లడించింది. ఈ నేరానికి పాల్పడిన వారితో పాటు వారికి సహకరించిన లేదా ప్రోత్సహించిన వ్యక్తులపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తప్పుడు పత్రాలు ఉపయోగించి మోసపూరితంగా సిమ్ కార్డులు పొందడం కూడా చట్టవిరుద్ధమేనని అధికారులు హెచ్చరించారు.

మీ సిమ్‌.. బాధ్యత కూడా మీదే

ప్రజలు తమ పేరుతో తీసుకున్న సిమ్ కార్డులను ఇతరులకు విక్రయించడం, బదిలీ చేయడం లేదా వినియోగానికి ఇవ్వడం చేయవద్దని టెలికాం శాఖ సూచించింది. మీ పేరుతో ఉన్న సిమ్‌ను ఉపయోగించి సైబర్ మోసాలు లేదా ఇతర నేరాలకు పాల్పడితే.. ఆ కనెక్షన్‌కు సంబంధించిన అసలు చందాదారుడు కూడా చట్టపరమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని తెలిపింది.

ఫోన్‌ వివరాలు ఇలా చెక్‌ చేసుకోండి

IMEI మార్చిన ఫోన్లు, మోడెమ్‌లు, సిమ్ బాక్స్‌ల వంటి అనుమానాస్పద పరికరాలను వినియోగించవద్దని కేంద్రం సూచించింది. ప్రజలు తమ మొబైల్ పరికరాల వివరాలను ‘సంచార్ సాథి’ పోర్టల్ ద్వారా పరిశీలించుకోవచ్చు. అక్కడ ఫోన్ IMEI నంబర్‌తో పాటు బ్రాండ్, మోడల్ వంటి వివరాలను తనిఖీ చేసుకుని అవి సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవచ్చు.

🏠 Home