సురేఖకు ఢిల్లీ పిలుపు.. హుటాహుటిన పయనం
సుస్మిత వ్యాఖ్యలపై అధిష్ఠానం సీరియస్
ఇప్పటికే వివరణ ఇచ్చిన సురేఖ
కేసీ వేణుగోపాల్‌తో భేటీకి అవకాశం
మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌లో ఉత్కంఠ నెలకొంది. ఈ పరిణామాల మధ్య పార్టీ అధిష్ఠానం నుంచి వచ్చిన పిలుపుతో సురేఖ హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు.
ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సురేఖ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసేందుకు కూడా ఆమె అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం.
ఇటీవల వరంగల్ జిల్లా గీసుకొండలో సీఎం రేవంత్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. దీనిపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వివరణ కోరుతూ సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కమిటీ ఛైర్మన్ మల్లు రవికి సురేఖ ఇప్పటికే తన వివరణ సమర్పించారు.
సురేఖ వివరణతో పాటు వనపర్తి వ్యవహారానికి సంబంధించిన నివేదికను కూడా టీపీసీసీ అధిష్ఠానానికి పంపించింది. ఈ నివేదికలు చేరిన వెంటనే సురేఖకు ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో.. హైకమాండ్ తదుపరి నిర్ణయంపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.