సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు అరుదైన ఘనత
దేశంలో అత్యధిక ఆదాయం పొందుతున్న స్టేషన్లలో 4వ స్థానం
గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,276.29 కోట్ల ఆదాయం
ఏడాదిలో 2.78 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు
రూ.714 కోట్లతో కొనసాగుతున్న ఆధునికీకరణ పనులు
హైదరాబాద్: దేశంలో ప్రయాణికుల ద్వారా అత్యధిక ఆదాయం పొందుతున్న రైల్వే స్టేషన్లలో సికింద్రాబాద్ జంక్షన్ నాలుగో స్థానాన్ని సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల ఆదాయం రూపంలో రూ.1,276.29 కోట్లు సమకూరాయి. సుమారు 2.78 కోట్ల మంది ప్రయాణికులు స్టేషన్ ద్వారా రాకపోకలు సాగించారు.
ఆదాయంలో రూ.3,337 కోట్లతో న్యూఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా, రూ.1,692 కోట్లతో హౌరా, రూ.1,299 కోట్లతో ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వీటి తరువాత సికింద్రాబాద్ నిలిచింది. ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాలకు కీలక అనుసంధాన కేంద్రంగా ఉండటంతో స్టేషన్కు ఈ గుర్తింపు లభించింది.
సికింద్రాబాద్ నుంచి రోజూ 180కి పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా.. సుమారు 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది ప్రయాణికులు స్టేషన్ను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం అమృత్ భారత్ పథకంలో భాగంగా రూ.714 కోట్లతో పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. మెట్రో అనుసంధానం, మల్టీ లెవల్ పార్కింగ్ సహా ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
ఆధునికీకరణ పూర్తయితే స్టేషన్ సామర్థ్యం మరింత పెరిగి, దేశంలోని టాప్-3 స్టేషన్లలో సికింద్రాబాద్ చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.