పోలవరం జలాలు.. ఉత్తరాంధ్రకు చేరిక
అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చేరాయి. ఈ సందర్భంగా పాయకరావుపేటలో జరిగిన సభలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడారు. ఐదు దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్న కల సీఎం చంద్రబాబు సంకల్పంతో నెరవేరిందని అన్నారు.
పోలవరం కేవలం ప్రాజెక్టు కాదని, ఉత్తరాంధ్రకు జీవనాడి అని అనిత పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టు పనులు దెబ్బతిన్నాయని విమర్శించారు. 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో పోలవరం పనులు 72 శాతం పూర్తయ్యాయని, ఆ తర్వాత ఐదేళ్లలో 2 శాతం పనులు కూడా జరగలేదని ఆరోపించారు.
చంద్రబాబును అపర భగీరథుడిగా అభివర్ణించిన అనిత.. ఒక్క ఓటుతో గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు చేరాయని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేసే రోజు ఎంతో దూరంలో లేదని ఆమె ధీమా వ్యక్తం చేశారు.