🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

గురువారం, 03 Sep 2026, 4:52 PM

QR Code

కొండా సురేఖ సంచలన ఆరోపణలు.. ‘నన్ను తొలగించకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తానన్నారు’!

News Image

హైదరాబాద్: తనను మంత్రివర్గం నుంచి తొలగించడంపై మాజీ మంత్రి కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనను పదవి నుంచి తొలగించకపోతే తాను తప్పుకుంటానంటూ కాంగ్రెస్‌ అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చారని ఆమె ఆరోపించారు. అధికారిక ప్రకటన రాకముందే తన బర్తరఫ్‌ విషయాన్ని సురేఖ ధ్రువీకరించారు.

తనను తొలగించే ముందు ప్రభుత్వం గానీ, పార్టీ అధిష్ఠానం గానీ సంప్రదించలేదని సురేఖ తెలిపారు. కనీసం తన వివరణ తీసుకోలేదని, రాజీనామా చేయాలని కూడా ఎవరూ కోరలేదన్నారు. తనతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు.

నలుగురు నేతలపై ఆరోపణలు

తనపై వేం నరేందర్‌రెడ్డి, తిరుపతి రెడ్డి, కొండల్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి కలిసి కుట్ర చేశారని కొండా సురేఖ ఆరోపించారు. తాను ఎలాంటి తప్పు చేశానని భావించడం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై తదుపరి ఏం చేయాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.

కుమార్తె వ్యాఖ్యలపై స్పందన

తన కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను రాజకీయంగా తనకు వ్యతిరేకంగా ఉపయోగించుకున్నారని సురేఖ అన్నారు. సుస్మిత స్వతంత్రంగా తన అభిప్రాయాలను వెల్లడించారని, ఆమెతో తాము మాట్లాడించలేదని స్పష్టం చేశారు.

రేవంత్‌పై ఎందుకు ఇంత తీవ్రత?

రేవంత్‌రెడ్డిని పలువురు విమర్శిస్తున్నప్పటికీ తన విషయంలోనే ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరించారో సీఎం ఆత్మపరిశీలన చేసుకోవాలని సురేఖ వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావాలని కోరుకున్న వారిలో తాము కూడా ఉన్నామని గుర్తుచేశారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తర్వాత తాను ఎక్కువగా అభిమానించిన నాయకుడు రేవంత్‌రెడ్డేనని తెలిపారు.

కాంగ్రెస్‌ వీడే ఆలోచన లేదన్న సురేఖ

ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీని వీడే ఆలోచన తనకు లేదని కొండా సురేఖ స్పష్టం చేశారు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీపై తనకు ఇప్పటికీ గౌరవం, అభిమానం ఉన్నాయని చెప్పారు. 2018లోనూ కొందరు తనకు టికెట్‌ రాకుండా అడ్డుకున్నారని, దాంతో అప్పట్లో బీఆర్‌ఎస్‌ వైపు వెళ్లాల్సి వచ్చిందని వివరించారు.

తనకు సంబంధించిన అన్ని విషయాలను కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు వివరించినట్లు సురేఖ వెల్లడించారు.

🏠 Home