ఆరు గ్యారంటీలు గాలికి.. 420 హామీలు బోగస్
కాంగ్రెస్ 1000 రోజుల పాలన దగా.. చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో దద్దరిల్లిన బీఆర్ఎస్ నిరసనలు
కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోయాం – ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన రేవంత్ సర్కార్
_కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్
సూర్యాపేట సెప్టెంబర్ 04 (ఆర్యాద్వి):
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, మోసపూరిత హామీలతో ప్రజలను నిలువునా వంచించిందని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా, చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో వృద్ధులు, వికలాంగులు, మహిళలతో నిర్వహించిన సదస్సు, వంటా-వార్పు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు:ఎన్నికల్లో గెలవడానికి వృద్ధులకు, వితంతువులకు రూ. 4000 పింఛన్, దివ్యాంగులకు రూ. 6000 పింఛన్, మహిళలకు నెలకు రూ. 2500, కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, విద్యార్థినులకు స్కూటర్లు ఇస్తామని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క వర్గానికీ న్యాయం చేయలేదని విమర్శించారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో దివ్యాంగులు, వృద్ధులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పింఛన్లు సకాలంలో అందించేవారమని గుర్తుచేశారు. నేడు సదరం క్యాంపులను సరిగ్గా నిర్వహించట్లేదని, సర్టిఫికెట్లు పొందాలంటే దళారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి కల్పించారని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు లేనిదే పనులు జరగని పరిస్థితి దాపురించిందన్నారు. అదేవిదంగా నిత్యావసర సరుకుల ధరలు, మందుల రేట్లు విపరీతంగా పెరిగి సామాన్యుడి బతుకు భారంగా మారిందని, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి అద్భుతమైన పథకాలను ప్రభుత్వం అటకెక్కించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరిట బస్సుల సంఖ్య తగ్గించి వారిని ఇబ్బందుల పాలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో నిరంతర కరెంట్, సాగునీరు అందించి వ్యవసాయాన్ని పండుగ చేస్తే.. నేడు కరెంట్ కోతలు, సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పేద విద్యార్థులు చదువుకునే గురుకులాల్లో కనీస సౌకర్యాలు లేక, కలుషిత ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి పాలకులు హెలికాప్టర్లలో తిరుగుతూ, అప్పులు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. తనకు పదవి ఉన్నా లేకపోయినా బడుగు, బలహీన వర్గాల కోసం, ప్రజల హక్కుల కోసం బీఆర్ఎస్ గులాబీ జెండా నీడన అండగా ఉండి నిరంతరం పోరాడుతానని స్పష్టం చేశారు.