ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. విమాన రాకపోకలకు అంతరాయం
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం కురిసిన భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలుచోట్ల భారీగా వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ ప్రభావం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంపైనా పడింది.
ఎయిర్పోర్ట్ పరిసరాల్లో నీరు నిలిచిపోవడంతో విమానాల రాకపోకల్లో ఆలస్యం చోటుచేసుకుంది. సుమారు 400కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచినట్లు సమాచారం. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కొన్ని విమానాలను ఇతర నగరాలకు మళ్లించారు.
మొత్తం తొమ్మిది విమానాలను ప్రత్యామ్నాయ విమానాశ్రయాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. వీటిలో నాలుగు జైపూర్, నాలుగు లక్నో, ఒక విమానాన్ని అహ్మదాబాద్కు మళ్లించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఇండిగో, ఎయిర్ ఇండియా ప్రయాణికులకు పలు సూచనలు చేశాయి. విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ ఫ్లైట్ పరిస్థితిని పరిశీలించుకోవాలని కోరాయి. ఢిల్లీలో రహదారులపై వాహనాల రాకపోకలు మందగించే అవకాశం ఉండటంతో ప్రయాణానికి అదనపు సమయం కేటాయించుకోవాలని సూచించాయి.
మరోవైపు ఎయిర్పోర్ట్లో నిలిచిన నీటిని తొలగించేందుకు సిబ్బంది చర్యలు చేపట్టారు. ప్రయాణికులు తమ విమానయాన సంస్థల నుంచి తాజా సమాచారం తెలుసుకోవాలని అధికారులు సూచించారు.
భారీ వర్షాలపై భారత వాతావరణ శాఖ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరికొంత సమయం పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.