వంట చేయలేదని భార్యపై దాడి.. పిల్లల ముందే దారుణం, భర్త అరెస్ట్
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. డ్యాన్స్ క్లాస్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతూ వంట చేయడానికి నిరాకరించిన భార్యపై భర్త దాడి చేయడంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. కృష్ణ లాల్ యాదవ్ (41) పని ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత భార్య యామిని (38)ని తనతో పాటు ఇద్దరు పిల్లలకు భోజనం సిద్ధం చేయాలని కోరాడు. అయితే అదే సమయంలో హౌసింగ్ సొసైటీలో నిర్వహిస్తున్న డ్యాన్స్ క్లాస్‌కు వెళ్లేందుకు యామిని సిద్ధమవుతోంది. వంట విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న కృష్ణ లాల్ తీవ్ర ఆగ్రహానికి గురై భార్యపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. పిల్లల ఎదుటే ఆమె మెడ, పొత్తికడుపు భాగంలో తీవ్రంగా కొట్టినట్లు వెల్లడించారు.
దాడి అనంతరం యామిని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర అంతర్గత గాయాల కారణంగా చికిత్స పొందుతూ ఆమె మరణించింది.
తొలుత పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం నిర్వహించిన పోస్టుమార్టంలో మెడ ఎముక విరిగినట్లు, గొంతు నులిమిన ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. అలాగే ప్రేగులకు కూడా తీవ్ర గాయాలైనట్లు వైద్యులు నిర్ధారించారు.