🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 05 September 2026, 6:22 pm Posted by : ARYADVI NEWS

గురువు స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

News Image
రాష్ట్ర అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగా అభివృద్ధి చెందినా.. విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దే గురువు స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. ఎన్నో ఏళ్లుగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో న్యాయపరమైన సమస్యలను అధిగమించి మెగా డీఎస్సీ నిర్వహించినట్లు తెలిపారు.

గురువులే విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దుతారు

తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న చంద్రబాబు.. భక్తవత్సలం అనే ఉపాధ్యాయుడి వద్ద తాను చదువుకున్న విషయాన్ని ప్రస్తావించారు. గురువుల నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నానని, తాను ఈ స్థాయికి రావడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉందని చెప్పారు.

భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత గురువుకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు పాఠశాలలో ఎక్కువ సమయం గడుపుతారని, వారిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, వివిధ రంగాల్లో నిపుణులుగా ఎదిగేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.

టెక్నాలజీ వచ్చినా గురువు అవసరం ఉంటుంది

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా ఆధునిక సాంకేతికతలో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ.. గురువు పాత్రకు ప్రత్యామ్నాయం ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు. విద్యార్థులకు కేవలం పాఠ్యపుస్తకాలలోని అంశాలను బోధించడం మాత్రమే కాకుండా.. సమాజం, ప్రపంచం, భవిష్యత్ అవకాశాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

జ్ఞానమే భవిష్యత్‌కు పునాది

తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐటీ, టెలికాం రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలను చంద్రబాబు గుర్తుచేశారు. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సహకారంతో టెలికాం రంగంలో కీలక మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆ నిర్ణయాల ఫలితంగా హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీకి ముఖ్యమైన కేంద్రంగా ఎదిగిందని పేర్కొన్నారు.

రాబోయే 10 నుంచి 15 ఏళ్లలో భారత్ రూపురేఖలు మరింతగా మారనున్నాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో జ్ఞానం, నైపుణ్యాలతో పాటు విలువలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
🏠 Home