🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 10 September 2026, 9:11 am Posted by : ARYADVI NEWS

సూపర్‌ ఇంటెలిజెన్స్‌తో మానవాళికి ముప్పు.. పరిశోధకుడి సంచలన హెచ్చరిక

News Image
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) భవిష్యత్తులో మానవాళికి తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉందని ఆంత్రోపిక్‌ సంస్థకు చెందిన పరిశోధకుడు జాకబ్‌ కాక్సన్‌ హెచ్చరించారు. ఈ కారణంగానే తాను ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు.
గతంలో ఓపెన్ఏఐలో పనిచేసిన కాక్సన్‌.. ప్రస్తుతం ఏఐ సంస్థలు స్వయంగా అభివృద్ధి చెందగల సూపర్‌ ఇంటెలిజెన్స్‌ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి వ్యవస్థలు అదుపు తప్పితే కీలక సాంకేతిక వ్యవస్థలను ప్రభావితం చేయడంతో పాటు భారీ స్థాయిలో మానవాళికి నష్టం కలిగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
కోట్ల విలువైన ఈక్విటీ వదులుకున్న పరిశోధకుడు
ఆంత్రోపిక్‌లో తనకు లభించాల్సిన కంపెనీ ఈక్విటీని పొందడానికి రెండు నెలల ముందే కాక్సన్‌ రాజీనామా చేసినట్లు సమాచారం. సంస్థ భవిష్యత్‌ దిశపై తనకు నమ్మకం లేకపోవడంతో, దాని విలువ పెరగడానికి తాను భాగస్వామి కావాలనుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.
మరో పరిశోధకుడి మద్దతు
కాక్సన్‌ హెచ్చరికలకు ఆంత్రోపిక్‌లోనే పనిచేస్తున్న అలైన్‌మెంట్‌ స్ట్రెస్‌-టెస్టింగ్‌ బృందం నాయకుడు ఇవాన్‌ హ్యూబింగర్‌ కూడా మద్దతు తెలిపారు. సూపర్‌ ఇంటెలిజెన్స్‌ వల్ల మానవాళికి తీవ్రమైన ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత ఏఐ మోడళ్లతో పోలిస్తే భవిష్యత్తులో స్వయంగా నేర్చుకుని సామర్థ్యాలను పెంచుకునే సూపర్‌ ఇంటెలిజెన్స్‌ నుంచే అసలు ముప్పు ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఏఐ సంస్థల మధ్య పెరుగుతున్న పోటీ కారణంగా భద్రతా చర్యల విషయంలో రాజీ పడే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
🏠 Home