🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

గురువారం, 24 Sep 2026, 5:56 PM

QR Code

నిర్లక్ష్యపు వార్డెన్ పై కేసు నమోదు చేయాలి..

News Image

నలుగురు విద్యార్థులు మృతి సంఘటన పై మండిపడ్డ గిరిజన సంఘాలు..

రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, ఇవ్వాలి.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి

వార్డెన్ సుదర్శన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలి –

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలి

డిప్యూటీ డైరెక్టర్, ఐటీడీఏ పీఓ నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరపాలి

దళిత ఆదివాసీ విద్యార్థులు మరణాలు పట్ల జిల్లా కలెక్టర్ నిర్లక్ష్య వైఖరిని ఖండించారు,

దళిత , ప్రజా సంఘాల జెఎసి డిమాండ్

టెక్కలి సెప్టెంబర్ 24

టెక్కలి గిరిజన పోస్టు మెట్రిక్ హాస్టల్ ఆవరణలో రైల్ ఢీకొని మృతి చెందిన దళిత విద్యార్థుల సంఘటనపై దళిత , ఆదివాసీ ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జెఎసి నాయకులు మాట్లాడుతూ, టెక్కలి–రాయివలస రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో టెక్కలి ట్రైబల్ వెల్ఫేర్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్‌లో చదువుతున్న గిరిజన విద్యార్థులు జన్ని దిలీప్ కుమార్, గంగువాడ విశాఖరావు, జాన్నీ శరత్ కుమార్, సవర శివ మృతి చెందడం తీవ్ర విషాదకరమని అన్నారు.ఈ ఘటనపై జిల్లా అధికార యంత్రాంగం, రాష్ట్ర ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేసినప్పటికీ, ఇప్పటివరకు బాధిత కుటుంబాలకు తగిన పరిహారం ప్రకటించకపోవడం, సంబంధిత వార్డెన్‌పై తక్షణ చర్యలు తీసుకోకపోవడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని, ఈ ప్రమాదంలో దెబ్బలు తగిలి శ్రీకాకుళం రిమ్స్ వైద్యం పొందుతున్న గంగువాడ సల్మాన్ రాజు కార్పొరేటు వైదం అందించాలని,ప్రతి బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన కు వారం రోజులు ముందు డిప్యూటీ డైరెక్టర్ అన్నం దొర వార్డెన్ పై విచారణ చేశారు కానీ తూతూ మంత్రంగా విచారణ చేసి వెళ్లిపోవడం తో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని తక్షణమే

వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలి

ఈ ఘటనకు సంబంధించి హాస్టల్ వార్డెన్ సుదర్శన్‌ను తక్షణమే సస్పెండ్ చేసి, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరపాలని జెఎసి నాయకులు డిమాండ్ చేశారు. బాధ్యతా లోపం లేదా నిర్లక్ష్యం ఉన్నట్లు విచారణలో తేలితే, వర్తించే చట్టాల ప్రకారం, ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీస్) చట్టం సహా సంబంధిత నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయాలని కోరారు.తుఫాన్ తీవ్రత దృష్ట్యా విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని జిల్లా అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసిన సమయంలోనే ఈ ఘటన జరగడం పట్ల నాయకులు ప్రశ్నలు లేవనెత్తారు. ఘటన జరిగిన సమయంలో సంబంధిత వార్డెన్ ఎక్కడ ఉన్నారు? విద్యార్థుల భద్రత కోసం తీసుకున్న చర్యలు ఏమిటి? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఒకే అధికారికి అనేక బాధ్యతలపై విచారణ జరపాలి

వార్డెన్ సుదర్శన్‌కు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గిరిజన పోస్ట్ మెట్రిక్ హాస్టల్ బాధ్యతలతో పాటు టెక్కలి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంపై కూడా జెఎసి నాయకులు ప్రశ్నలు లేవనెత్తారు.

శ్రీకాకుళం నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెక్కలి హాస్టల్‌ను ఒకే వ్యక్తి సమర్థవంతంగా పర్యవేక్షించడం సాధ్యమేనా? టెక్కలిలో సీనియర్, సమర్థులైన అధికారులు అందుబాటులో లేరా? అనే అంశాలను జిల్లా కలెక్టర్, సంబంధిత మంత్రి, ఐటీడీఏ ఉన్నతాధికారులు పరిశీలించాలని కోరారు.

ఒకే వ్యక్తికి అనేక బాధ్యతలు అప్పగించిన విధానం వెనుక ఏదైనా పరిపాలనా కారణాలు ఉన్నాయా, లేక ఇతర కారణాలున్నాయా అనే అంశంపై కూడా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధ్యతల కేటాయింపులో ఆర్థిక అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు లేదా అనుమానాలు ఉంటే వాటిని కూడా విచారణ ద్వారా తేల్చాలని కోరారు.

ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్, పీఓ నిర్లక్ష్యంపై విచారణ.

గిరిజన విద్యార్థుల భద్రత, హాస్టల్ నిర్వహణ, వార్డెన్‌లకు బాధ్యతల కేటాయింపు, పర్యవేక్షణ వంటి అంశాల్లో ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ మరియు ఐటీడీఏ పీఓ పాత్రపై సమగ్ర విచారణ జరపాలని దళిత ఆదివాసీ ప్రజా సంఘాల జెఎసి డిమాండ్ చేసింది.

భవిష్యత్తులో ఇటువంటి విషాదకర ఘటనలు పునరావృతం కాకుండా అన్ని గిరిజన సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల భద్రతకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించి, వాటిని కచ్చితంగా అమలు చేయాలని కోరారు.

ఈ సందర్భంగా జెఎసి నాయకులు మాట్లాడుతూ, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ దళిత ఆదివాసీ విద్యార్థులు పట్ల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా

గతంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గురుకులo పాతపట్నం లో చింతల పూజ మృతి పై సంబధిత ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఇప్పుడు టెక్కలి పోస్టు మెట్రిక్ హాస్టల్ గిరిజన విద్యార్థులు మృతి పై కనీస చర్యలు లేవు ఈ జిల్ కలెక్టర్ దళిత ఆదివాసీ ల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్ధమౌతుంది అని అన్నారు, తక్షణమే జిల్లా కలెక్టర్ ను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల జెఎసి జిల్లా కన్వీనర్ దుర్గాసి గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బెలమర ప్రభాకర్, విదసం ఐక్యవేదిక రాష్ట్ర సహాయ కార్యదర్శి యడ్ల గోపి, DTF గౌరవ అధ్యక్షులు కోత ధర్మారావు , సమతా సైనిక్ దల్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా రామారావు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పత్రీ దినేష్, వైకుంఠరావు, గేదెల రమణ మూర్తి జిల్లా SC/ST విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు,కొచ్చ శ్రీను అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, జెన్నీ సింహాచలం, గిరిజన చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి లక్ష్మీపురం రామచంద్రరావు, తలసముద్రం సూర్యం నిరుద్యోగం పోరాట సమితి జిల్లా కార్యదర్శి, బసవల గోవిందరావు దళిత చైతన్య వేదిక కార్యదర్శి, కె జగ్గారావు, ఎక్కురాడ మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

🏠 Home