🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 30 September 2026, 8:03 am Posted by : ARYADVI NEWS

దసరా సంప్రదాయం పేరుతో పాలపిట్టలను బంధించొద్దు.. అటవీశాఖ హెచ్చరిక

News Image
విజయదశమి సందర్భంగా పాలపిట్టలను పట్టుకుని పంజరాల్లో ఉంచడం లేదా ప్రజలకు ప్రదర్శించడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ అటవీశాఖ హెచ్చరించింది. పాలపిట్టలను స్వేచ్ఛగా వాటి సహజ ఆవాసంలో చూడటమే సంప్రదాయమని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు క్షేత్రస్థాయి సిబ్బందికి అటవీశాఖ ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు.హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో అటవీశాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దసరా సందర్భంగా పాలపిట్టల సంరక్షణతో పాటు పక్షులకు ప్రమాదకరంగా మారుతున్న చైనా మాంజా అంశంపై సమావేశంలో చర్చించారు. అటవీ దళాల అధిపతి వినయ్ కుమార్ అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు.
పాలపిట్టలను పంజరాల్లో పెట్టొద్దు
విజయదశమి రోజున పాలపిట్టను చూడటం శుభప్రదమనే నమ్మకం తెలంగాణలో చాలాకాలంగా ఉంది. అయితే ఈ సంప్రదాయాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుని పాలపిట్టలను పట్టుకుని పంజరాల్లో పెట్టి ప్రదర్శిస్తున్న ఘటనలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
అడవిలో స్వేచ్ఛగా జీవించే పక్షులను బంధించడం వల్ల వాటిపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుందని అటవీశాఖ పేర్కొంది. సరైన ఆహారం, నీరు అందకపోవడంతో అవి బలహీనపడే అవకాశం ఉందని, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుందని వివరించింది.
గత ఏడాది దసరా సమయంలో పంజరాల్లో బంధించిన 28 పాలపిట్టలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకుని తిరిగి ప్రకృతిలోకి విడిచిపెట్టిన విషయాన్ని అధికారులు గుర్తుచేశారు. పాలపిట్టలను పట్టుకోవడం, బంధించడం వన్యప్రాణి సంరక్షణ చట్ట పరిధిలోకి వస్తుందని స్పష్టం చేశారు.
ఆలయాల వద్ద ప్రత్యేక నిఘా
దసరా ఉత్సవాలు నిర్వహించే ప్రాంతాల్లో పాలపిట్టలను బంధించి ప్రదర్శించకుండా చూడాలని అటవీశాఖ సూచించింది. ముఖ్యంగా ఆలయాల పరిసరాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పర్యవేక్షణ పెంచాలని దేవాదాయశాఖ అధికారులను కోరింది.
పాలపిట్టను చూడాలనే సంప్రదాయం ఉంటే దానిని ప్రకృతిలో స్వేచ్ఛగా ఎగురుతున్న సమయంలోనే చూడాలని అధికారులు సూచించారు. పక్షిని పట్టుకోవడం లేదా పంజరంలో పెట్టడం సంప్రదాయంలో భాగం కాదని స్పష్టం చేశారు.
చైనా మాంజాపైనా నిఘా
సమావేశంలో చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై కూడా అధికారులు సమీక్షించారు. గాజు పొడి పూసిన ఈ రకమైన మాంజా వల్ల పక్షులకు తీవ్ర గాయాలు కావడంతో పాటు ప్రాణాలు కోల్పోయే ఘటనలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. కొన్ని సందర్భాల్లో మనుషులకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో చైనా మాంజా విక్రయాలు, నిల్వలు, వినియోగాన్ని అడ్డుకునేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా పాలపిట్టలను బంధించినా, ప్రమాదకరమైన మాంజాను విక్రయించినా వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరింది.
🏠 Home