సిరిసిల్లలో సీఎం రేవంత్ పాదయాత్ర.. భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు
సిరిసిల్ల, సెప్టెంబర్ 30: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా సిరిసిల్లకు చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్లోని నేతన్న విగ్రహం మీదుగా రగుడు బైపాస్ వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతోంది. అనంతరం బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు.సీఎం పాదయాత్రకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ ముఖ్య నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. దీంతో సిరిసిల్లలోని ప్రధాన రహదారులు కాంగ్రెస్ శ్రేణులతో సందడిగా మారాయి.అంతకుముందు కరీంనగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి అనంతరం సిరిసిల్లకు చేరుకున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా సిరిసిల్లలో సుమారు రూ.350 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేపట్టారు.విద్యా రంగానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు కూడా సీఎం శంకుస్థాపనలు చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. కోనరావుపేట, సిరిసిల్ల ప్రాంతాల్లో పబ్లిక్ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.పరిపాలనా సౌకర్యాల కోసం కొత్త భవనాల నిర్మాణ పనులకు కూడా శ్రీకారం చుట్టారు. ఆర్డీఓ కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రుద్రంగిలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాముల నిర్మాణానికి కూడా భూమిపూజ చేశారు.సిరిసిల్ల పర్యటనలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజలతో మమేకమయ్యేలా సీఎం పాదయాత్ర చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాదయాత్ర ముగిసిన అనంతరం రగుడు బైపాస్ వద్ద జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఈ సభలో జిల్లాకు సంబంధించిన మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది.