చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం
చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలకు మార్చకుండా కొనసాగించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి ప్రస్తుతం ఉన్న రేట్లే వర్తిస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. దీంతో పీపీఎఫ్పై 7.1 శాతం వడ్డీ కొనసాగనుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజనపై 8.2 శాతం చొప్పున వడ్డీ లభించనుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్పై 7.7 శాతం, కిసాన్ వికాస్ పత్రపై 7.5 శాతం వడ్డీ రేట్లు కొనసాగుతాయి. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లకు కూడా ప్రస్తుతం ఉన్న రేట్లే వర్తిస్తాయి. ప్రభుత్వ సెక్యూరిటీల రాబడులను ఆధారంగా చేసుకుని కేంద్రం ప్రతి త్రైమాసికం చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది.