బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: చంద్రబాబు
రేపల్లె: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. బీసీ రిజర్వేషన్లను గత ప్రభుత్వం 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించిందని ఆరోపించారు. తాము మళ్లీ 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రయత్నిస్తే కోర్టును ఆశ్రయించి అడ్డుకున్నారని విమర్శించారు. ఈ అంశంపై రేపే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.
గత ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని చంద్రబాబు ఆరోపించారు. అప్పులు తెచ్చేందుకు రాష్ట్ర ఆస్తులను, భవిష్యత్ ఆదాయాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక క్రమశిక్షణతో పరిస్థితిని చక్కదిద్దుతున్నామని చెప్పారు.
అమరావతి, పోలవరంపై విమర్శలు
అమరావతిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా అభివృద్ధి చేస్తామని, ఇకపై దాన్ని ఎవరూ కదిలించలేరని అన్నారు. పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేసి వచ్చే ఏడాది మార్చి నాటికి ఫేజ్-1 ద్వారా నీటిని అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
రాష్ట్రాన్ని ‘స్వర్ణాంధ్ర 2047’ లక్ష్యంతో అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ‘ఆరోగ్యం, ఆదాయం, ఆనందం’ అనే సూత్రాలతో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 2024 ఎన్నికల్లో కూటమికి ప్రజలు ఇచ్చిన తీర్పును బాధ్యతగా స్వీకరించి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పనిచేస్తున్నామని పేర్కొన్నారు.