అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవు...
తహసిల్దార్ కమలాకర్
అనంతగిరి , అక్టోబర్ 03 (ఆర్యాద్వి): ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అనంతగిరి తహసిల్దార్ కమలాకర్ ఓ ప్రకటన ద్వారా హెచ్చరించారు.మండల పరిధిలోని కొత్తగూడెం,పాలేరు వాగు పరిధిలో అక్రమ ఇసుక రవాణా జరుగుతోందని తమ దృష్టికి వచ్చిందన్నారు. కొందరు వ్యక్తులు రాత్రి,పగలు తేడా లేకుండా పడవలతో ఇసుకను తోడి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారని సమాచారం వచ్చిందనీ తెలిపారు.ఈ నేపథ్యంలో రెవెన్యూ,పోలీస్,మైనింగ్ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేస్తామన్నారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేసే ట్రాక్టర్లను సీజ్ చేసి,అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.ఇసుక అక్రమ రవాణా వలన భూగర్భ జలాలు అడుగంటి రైతులు నష్టపోతున్నారని,అందుకే ఇలాంటి అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని,ఎవరైనా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు,రైతులకు తహసిల్దార్ కమలాకర్ విజ్ఞప్తి చేశారు.