🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

ఆదివారం, 04 Oct 2026, 9:17 AM

QR Code

ఆర్టీఏలో పెండింగ్ ఆర్సీ, డీఎల్ కార్డులు లేవు.. 7 పనిదినాల్లో ఇంటికే స్పీడ్ పోస్టు ద్వారా పంపిణీ

News Image

వాహనదారులు కార్డులు రాకపోతే సమీప పోస్టాఫీసును సంప్రదించాలి.. వాహనాల అమ్మకం తర్వాత యాజమాన్య బదిలీ తప్పనిసరి: జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్

మహబూబాబాద్ ప్రతినిధి: అక్టోబర్, 3: మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయం ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. "స్పీడీ డిస్పోజ్, ఎర్లీ డిస్పాచ్" (త్వరిత పరిష్కారం.. ముందస్తు పంపిణీ) అనే నినాదంతో కార్యాలయంలోని ప్రతి సేవకు నిర్దిష్ట కాలపరిమితిని నిర్ణయించి అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఏడు పనిదినాల్లో ఆర్సీ, డీఎల్ కార్డులు

చాలామంది వాహన యజమానులు తమకు ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు అందలేదని కార్యాలయానికి వస్తున్నారని శంకర్ నాయక్ తెలిపారు. అయితే మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఎలాంటి పెండింగ్ ఆర్సీ, డీఎల్ కార్డులు లేవని స్పష్టం చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష జరిగిన రోజు నుంచి ఏడు పనిదినాల్లోగా కార్డులు అందకపోతే సమీప పోస్టాఫీసును సంప్రదించాలని సూచించారు.

ప్రతి ఆర్సీ, డీఎల్ కార్డును స్పీడ్ పోస్టు ద్వారా ఆధార్‌లో నమోదైన చిరునామాకు పంపిస్తున్నట్లు తెలిపారు. ఏడు పనిదినాల తర్వాత కూడా కార్డు అందకపోతే వెంటనే మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయ అధికారులను నేరుగా సంప్రదించాలని వాహనదారులకు సూచించారు.

ప్రతి సేవకు నిర్దిష్ట కాలపరిమితి

రవాణా శాఖ కార్యాలయంలో అందించే సేవలకు నిర్ణయించిన కాలపరిమితిని ఈ విధంగా వివరించారు.

1\. ఎల్‌ఎల్‌ఆర్: దరఖాస్తు ప్రక్రియకు ఒక గంటలో సేవలు అందించేలా చర్యలు.

2\. డీఎల్, ఆర్సీ: ఏడు పనిదినాల్లో స్పీడ్ పోస్టు ద్వారా నేరుగా ఇంటికి పంపిణీ.

3\. కమర్షియల్ వాహనాల ఆర్సీ, పర్మిట్, ఎఫ్‌సీ: అదే రోజు డెలివరీ.

కమర్షియల్ వాహనాలకు సంబంధించిన పత్రాల కోసం వాహనదారులు కార్యాలయంలో పెండింగ్ ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిర్ణీత ప్రక్రియ పూర్తయిన తర్వాత అదే రోజు పత్రాలు పొందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

వాహనం అమ్మిన వెంటనే యాజమాన్య బదిలీ చేయించుకోవాలి

వాహనాల విక్రయానికి సంబంధించి కూడా వాహనదారులకు శంకర్ నాయక్ కీలక సూచనలు చేశారు. చాలామంది తమ కార్లను విక్రయించినప్పటికీ, యాజమాన్య బదిలీ చేయించుకోకపోవడంతో ప్రభుత్వ రికార్డుల్లో వాహనాలు ఇప్పటికీ తమ పేరుపైనే ఉన్నట్లు చూపిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో తమ పేరుపై కారు ఉన్నట్లు చూపిస్తోందని కొందరు కార్యాలయాన్ని సంప్రదిస్తున్నారని వివరించారు.

వాహనాన్ని విక్రయించిన యజమానులు కొనుగోలుదారుడి పేరుపై యాజమాన్య బదిలీ జరిగేలా స్వయంగా దగ్గరుండి ప్రక్రియను పూర్తి చేయించాలని సూచించారు. అలా చేయకపోతే ప్రభుత్వ రికార్డుల్లో వాహనం పాత యజమాని పేరుపైనే కొనసాగుతుందని హెచ్చరించారు.

వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన పత్రాలు, యాజమాన్య బదిలీ వివరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, రవాణా శాఖ అందిస్తున్న సేవలను నిర్ణీత సమయంలో వినియోగించుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్ విజ్ఞప్తి చేశారు.

🏠 Home