🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 04 October 2026, 6:48 pm Posted by : ARYADVI NEWS

కోదాడలో దారుణం.. వృద్ధురాలిని మోసం చేసి అర ఎకరం కాజేత!

News Image
ఆధార్ అప్డేట్ అంటూ వేలిముద్ర తీసుకుని పొలం రిజిస్ట్రేషన్

కోదాడ, అక్టోబర్ 4(ఆర్యాద్వి): సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మానవత్వం మరచిన అమానవీయ ఘటన వెలుగుచూసింది. ఆధార్ కార్డు అప్డేట్ చేయాలంటూ నమ్మించి, ఓ వృద్ధురాలి నుండి అర ఎకరం పొలాన్ని మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
అసలేం జరిగింది?
కోదాడ పట్టణం లక్ష్మీపురం కాలనీకి చెందిన కుక్కడపు రాములమ్మ అనే వృద్ధురాలికి అర ఎకరం పొలం ఉంది. ఆమె మనమరాలు అనంతుల వినీత కుటుంబ సభ్యులు రాములమ్మ వద్దకు వచ్చి "నీ ఆధార్ కార్డు అప్డేట్ చేయాలి, తహసీల్దార్ ఆఫీస్ కు రా" అని నమ్మబలికారు.

అమాయకత్వంతో వారిని నమ్మిన రాములమ్మ వారితో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లింది. అక్కడ ఆధార్ అప్డేట్ కోసం అని చెప్పి ఆమెతో వేలిముద్రలు వేయించి, ఆమెకు తెలియకుండానే అర ఎకరం పొలాన్ని తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది.

మోసపోయానని తెలుసుకున్న రాములమ్మ తనకు న్యాయం చేయాలని కోరుతూ గురువారం కోదాడ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చింది. అయితే గాంధీ జయంతి సందర్భంగా అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఆమె ఆవేదనను మీడియా ముందు వెళ్లబోసుకుంది.

"నా ఆధార్ బాగుచేపిస్తామని చెప్పి పొలం కాజేశారు, నాకు న్యాయం చేయండి" అంటూ కన్నీటి పర్యంతమవుతూ అధికారులను వేడుకుంది.

బాధితురాలి ఫిర్యాదుపై స్పందించి అధికారులు విచారణ జరిపి, తన పొలాన్ని తిరిగి ఇప్పించాలని స్థానికులు కోరుతున్నారు.
🏠 Home