🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

బుధవారం, 07 Oct 2026, 6:49 PM

QR Code

ERC పేరుతో రూ.5,400 కోట్ల విద్యుత్ భారం - ప్రజల నెత్తిన కాంగ్రెస్ బండ!

News Image

బిల్లు కట్టలేక సచివాలయంలోనే మంచినీళ్లు బంద్ - మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఫైర్

కోదాడ, అక్టోబర్ 7 (ఆర్యాద్వి ): ట్రూయప్ (True-Up) పేరుతో ERC ద్వారా రూ.5,400 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజల నుంచి బలవంతంగా వసూలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని కోదాడ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ నాయకులు బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

కోదాడలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెబుతూనే, కాంగ్రెస్ మంత్రులు దుబారా ఖర్చులతో హెలికాప్టర్లలో గాల్లో చక్కర్లు కొడుతూ, విందులు, విహార యాత్రలతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలపై అదనపు భారం వేస్తే భవిష్యత్తులో తిరుగుబాటు తప్పదు" అని హెచ్చరించారు.

రైతు నడిరోడ్డుపై.. ప్రభుత్వం గాల్లో..

ప్రస్తుత కరువు కాలంలో సాగునీరు, కరెంటు, యూరియా, రైతుబంధు లేక రైతులు అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. "గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కన్వర్టర్లు, జనరేటర్లు లేకుండా 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చాం. నేడు రైతు పంట కాపాడుకోవడానికి రోజుకు వేల రూపాయలు పెట్టి డీజిల్ పోయాల్సిన దుస్థితి. పెట్టుబడికి అప్పులు చేసి, పంటలు ఎండిపోయి రైతు నడిరోడ్డు మీద విలపిస్తుంటే, మళ్లీ రూ.5,400 కోట్ల భారం వేయడం దారుణం" అని మండిపడ్డారు.

గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచితం అని చెప్పి, 201 యూనిట్లు దాటితే మొత్తం బిల్లు కట్టిస్తూ సామాన్యులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ కోతలతో రైతులను ఇబ్బంది పెడితే గతంలో బషీర్ బాగ్ పోరాటాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. పెంచిన బిల్లులను ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లించవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.

సచివాలయంలోనే మంచినీళ్లు బంద్ - దివాళా ప్రభుత్వం

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని, సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు కూడా మంచినీళ్ల బిల్లులు చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ నీటి సరఫరానే నిలిపివేశారని, కాంట్రాక్టర్లు తమ బిల్లుల కోసం సచివాలయంలోనే ధర్నాలు చేస్తున్నారని, 20 శాతం కమీషన్ ఇస్తేనే బిల్లులు మంజూరు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

గురుకులాల్లో పౌష్టికాహారం లేదు - సైజులు లేని బూట్లు

గురుకుల పాఠశాలల్లో దళిత, బహుజన విద్యార్థులకు కనీస పౌష్టికాహారం అందడం లేదని, దీంతో వారు ఆసుపత్రుల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు జేబులు నింపుకోవడానికి సరిపోని సైజుల్లో బూట్లు, యూనిఫామ్స్ అంటగడుతున్నారని, కోదాడ ప్రభుత్వ పాఠశాలలో 600 మంది పిల్లలకు కనీసం వంటగది కూడా నిర్మించలేకపోయారని విమర్శించారు. కల్యాణలక్ష్మి, పెన్షన్లు వంటి పథకాలను అటకెక్కించారన్నారు.

ప్రభుత్వం కేవలం ప్రచార ఆర్భాటాలు, అబద్ధాలు, అవినీతితో పాలన సాగిస్తోందని, హిట్లర్ తరహా పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు సమాధానం చెప్పాలని ప్రజలకు, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులకు విజ్ఞప్తి చేశారు.

🏠 Home