సర్ పేరుతో ఓట్ల తొలగింపు కు కుట్ర
వామపక్ష నేతలపై లాఠీ చార్జీకి సీపీఐ(ఎం) ఖండన
కారేపల్లి, అక్టోబర్, 8:
కారేపల్లి: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పేరుతో ఓట్ల తొలగింపుకు కుట్రకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు విమర్శించారు. గురువారం కారేపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓట్ల చోరీకి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న వామపక్ష, ప్రజాసంఘాల నాయకులు, యువతీ యువకులపై లాఠీచార్జి చేయడం, అక్రమ అరెస్టులకు పాల్పడటం దారుణమన్నారు. ఎన్నికల కమిషన్ అధికార బీజేపీకి ఏజెంట్గా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో తొలగించిన లక్షలాది ఓట్లను తిరిగి జాబితాలో చేర్చాలన్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలని, దానికి బాధ్యత వహిస్తూ ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు శాంతియుతంగా నిరసన తెలిపే వారిపై లాఠీచార్జి, అరెస్టులను చేయటం అవివేకమని వాటిని తక్షణమే నిలిపివేయాలని కోరారు.