ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అధికార దుర్వినియోగం
అర్హులకు అన్యాయం – కాంగ్రెస్ కార్యకర్తలకే ప్రాధాన్యం
కాగితాలకే పరిమితమైన నిబంధనలు
కాంగ్రెసేతర సర్పంచులు, ఇందిరమ్మ కమిటీల జాబితాల బుట్టదాఖలు
ప్రజల డబ్బుతో రాజకీయాలా?
కాంగ్రెస్ కండువా కప్పితేనే ఇళ్లా?
పారదర్శకత లోపించిన ఎంపిక విధానం
పేదలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోం
అధికార దుర్వినియోగం పై న్యాయపోరాటం
విలేకరుల సమావేశంలో సిపిఐ ( ఎం ) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 9:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కేటాయింపుల్లో జిల్లా వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో అధికార దుర్వినియోగం, రాజకీయ వివక్ష జరుగుతున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఖమ్మంలోని సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన పేదలకు ఇళ్లు కేటాయించకుండా, కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ జెండా కప్పుకున్న వారికే ప్రాధాన్యమిస్తూ ఇళ్లను మంజూరు చేస్తున్నారని, ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెసేతర పార్టీల సర్పంచులు, ఇందిరమ్మ కమిటీలు నిబంధనల ప్రకారం సిద్ధం చేసి ఇచ్చిన అర్హులైన నిరుపేదల జాబితాలను అధికారులు, మంత్రులు పూర్తిగా బుట్టదాఖలు చేస్తున్నారని ఆధారాలతో సహా వెల్లడించారు. ఈ అన్యాయంపై అధికారులు, ప్రభుత్వం వెంటనే తమ తీరు మార్చుకోకపోతే జిల్లా వ్యాప్తంగా బాధితులైన పేదలతో కలిసి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని, అవసరమైతే కోర్టులను ఆశ్రయించి న్యాయ పోరాటం చేసి పేదలకు ఇళ్లు దక్కేలా చూస్తామని ఆయన హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఐదేళ్ల కాలంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ప్రతీ నిరుపేద కుటుంబానికి నీడ కల్పిస్తామని హామీ ఇచ్చిందని నున్నా నాగేశ్వరరావు గుర్తుచేశారు. మొదటి విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఇళ్లు ప్రకటిస్తూ, అర్హుల ఎంపిక కోసం ఎల్-1, ఎల్-2, ఎల్-3 వర్గీకరణను రూపొందించారని తెలిపారు. సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారిని, రేకుల ఇళ్లు లేదా చిన్న గుడిసెలలో నివాసముంటున్న అత్యంత నిరుపేదలను మొదటగా ఆదుకుంటామని ప్రకటించారన్నారు. దీని ప్రకారం ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు గాను మొదటి పేజ్లో 16,872 ఇళ్లు, రెండో పేజ్లో 10,400 ఇళ్లు మంజూరయ్యాయని వివరించారు. అయితే ఆచరణలోకి వచ్చేసరికి ప్రభుత్వం చెప్పిన నిబంధనలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని, క్షేత్రస్థాయిలో అధికార పార్టీ నాయకుల ఇష్టారాజ్యమే నడుస్తోందని విమర్శించారు.
గ్రామాల్లో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా, గ్రామాభివృద్ధిని కాంక్షించే గ్రామ సర్పంచ్ చైర్మన్గా ఉండే ఇందిరమ్మ కమిటీలు ఇచ్చిన ఆమోదిత జాబితాల ప్రకారమే ఇళ్లు కేటాయించాలని నిబంధనలు చెప్తున్నాయని నాగేశ్వరరావు పేర్కొన్నారు. కానీ జిల్లాలో కాంగ్రెసేతర సర్పంచులు ఉన్న గ్రామాల్లో వారిని పూర్తిగా పక్కనబెట్టి, వారి ఇచ్చిన లిస్టులను కనీసం పరిగణనలోకి కూడా తీసుకోవడం లేదని ఆరోపించారు. మంత్రులు కూడా ఇతర పార్టీల సర్పంచులు ఇచ్చిన అర్హుల జాబితాలను పట్టించుకోకుండా, కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇచ్చిన జాబితాలకే ఇళ్లను మంజూరు చేస్తూ తీవ్ర వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. ఉదాహరణకు తిరుమలాయపాలెం మండలంలోని ఎదుళ్ల చెర్వు, ఎం.వెంకటాయపాలెం, కొదుమూరు, నేలకొండపల్లి, పాలేరు, నాయకన్ గూడెం, మల్లేపల్లి, గట్టు సింగారం, నేలపట్ల, మధిర తదితర ప్రాంతాల్లో సర్పంచులు నిబంధనల ప్రకారం అత్యంత అర్హులైన పేదల పేర్లతో జాబితా ఇస్తే, అందులో ఒక్కరికి కూడా ఇల్లు మంజూరు చేయకపోవడం దారుణమన్నారు.
కొన్ని గ్రామాల్లో ఎల్-1 కేటగిరీలో అర్హులైన నిరుపేదలు ఉన్నప్పటికీ, వారికి ఇవ్వకుండా రాజకీయ ఒత్తిళ్లతో ఎల్-2, ఎల్-3 లో ఉన్న కాంగ్రెస్ నాయకుల అనుచరులకే కట్టబెడుతున్నారని పేర్కొన్నారు. మరికొన్ని చోట్ల మంజూరైన ఇళ్లకు అర్హులు లేరనే నెపంతో వెనక్కి పంపడం లేదా ఇతర పార్టీలకు చెందిన పేదలను కాంగ్రెస్ కండువా కప్పుకుంటేనే ఇళ్లు ఇస్తామని బెదిరింపులకు గురిచేయడం తుగ్లక్ పాలనను తలపిస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో, ప్రజలు కట్టిన పన్నుల డబ్బుతో అమలు చేస్తున్న సంక్షేమ పథకమని, ఇది కాంగ్రెస్ పార్టీ సొంత నిధుల నుంచి ఇస్తున్నది కాదని నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ ఫలాలను ఒక పార్టీకే పరిమితం చేయడం చట్టవిరుద్ధమని హితవు పలికారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు సమయంలో గ్రామసభలు నిర్వహించి, అర్హులైన పేదలందరినీ గుర్తించి, పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా ఇళ్లను ఎంపిక చేశారని ఆయన గుర్తుచేశారు. దానివల్ల ఎలాంటి వివాదాలు లేకుండా అర్హులకు ఇళ్లు దక్కాయని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అటువంటి పారదర్శక విధానాన్ని అమలు చేయాలని లేదా గ్రామసభలు, సర్పంచుల కమిటీ నిర్ణయించిన జాబితాల ప్రకారం ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను కాపాడాల్సిన అధికారులే అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి చట్టాన్ని ఉల్లంఘిస్తే, వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేలా న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
ఈ అధికార దుర్వినియోగం, అక్రమాలపై త్వరలోనే సీపీఎం ప్రతినిధి బృందం, బాధితులైన ప్రజాప్రతినిధులతో కలిసి ఖమ్మం జిల్లా కలెక్టర్ను కలవనున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న వివక్షను ఆధారాలతో సహా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, తక్షణమే విచారణ జరిపించి అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు. ఒకవేళ జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా ఇదే రకమైన వైఖరిని కొనసాగిస్తే, బాధితులైన నిరుపేదలందరినీ ఏకం చేసి కలెక్టరేట్ ముట్టడితో పాటు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని, అలాగే కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేసి పేదల హక్కులను కాపాడతామని నున్నా నాగేశ్వరరావు స్పష్టం చేశారు.విలేకరుల సమావేశంలో సిపిఐ ( ఎం ) పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, యర్రా శ్రీనివాసరావు, భూక్యా వీరభద్రం, మాదినేని రమేష్, పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్ పాల్గొన్నారు.