🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

శనివారం, 10 Oct 2026, 8:51 AM

QR Code

కాంట్రాక్ట్-ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా.. స్థానిక ఎన్నికలకు సెగ..!

News Image

హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమా? - వైసీపీకి అస్త్రంగా మారిన ఉద్యమం

*శ్రీకాకుళం, అక్టోబర్ 09

రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్-ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక ధర్నా ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఈనెల 2వ తేదీ నుంచి రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ధర్నా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపనుందనే చర్చ జోరుగా సాగుతోంది.

ఏం జరుగుతోంది?

శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ ఎదుట గురువారం వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన ధర్నాలో దాదాపు 1500 మందికి పైగా పాల్గొన్నారు. "100% గ్రాస్ వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం కావాలి, వెంటనే రెగ్యులరైజ్ చేయాలి" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెల్ల యూనిఫాంలో ఉన్న నర్సులు "20 ఏళ్లుగా రూ.38 వేలతోనే బతుకుతున్నాం, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నా జీతంలో వివక్ష ఎందుకు?" అని ఆవేదన వ్యక్తం చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అయితే కేవలం రూ.15 వేలతో కుటుంబాన్ని ఎలా పోషించాలని ప్రశ్నిస్తున్నారు.

కూటమి ప్రభుత్వానికి మైనస్..

ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ, సంక్షేమ పథకాలు, సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు దాటినా ఆ హామీలు నెరవేరకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

రాజకీయంగా చూస్తే రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వారి కుటుంబాలతో కలిపితే దాదాపు 12 లక్షల ఓట్లు. ప్రతి గ్రామ సచివాలయం, పీహెచ్సీ, మున్సిపాలిటీలో వీరి ప్రభావం ఉంది. "ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు" అనే వీరి మాట గ్రామాల్లో 50 నుంచి 100 ఓట్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

వైసీపీకి ప్లస్..

ఈ పరిస్థితిని ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. తమ హయాంలోనే ఆప్కాస్ (APCOS) తెచ్చి ఈఎస్ఐ, ఈపీఎఫ్ సౌకర్యం కల్పించామని చెబుతూ, ప్రస్తుతం ధర్నా శిబిరాలకు ఆ పార్టీ నేతలు వెళ్లి సంఘీభావం తెలుపుతున్నారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల కడుపు కొడుతోందని ప్రచారం చేస్తున్నారు.

సేవలకు అంతరాయం:

ధర్నా కారణంగా ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్ లలో సేవలు నిలిచిపోయాయి. ఇది సామాన్య ప్రజలపై ప్రభావం చూపుతోంది. దీన్ని అలుసుగా తీసుకుని ప్రతిపక్షాలు ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉంది.

మొత్తానికి ప్రభుత్వం వెంటనే పీఆర్సీ నియామకం, 100% గ్రాస్ వేతనం, రెగ్యులరైజేషన్ పై స్పష్టమైన ప్రకటన చేయకపోతే, ఈ ధర్నా స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి పెద్ద మైనస్ గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

🏠 Home