ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం...
మానసిక ఆరోగ్యంపై అవగాహనతోనే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం
ఖమ్మం, అక్టోబర్ 10:
మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా మాత్రమే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఖమ్మం పట్టణంలోని డీపీఆర్సీ భవనంలో తాళ్లూరి లక్ష్మి అధ్యక్షతన ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్పీ రీజినల్ ఇంటెలిజెన్స్ అధికారి శ్రీరామోజు రమేష్, ఖమ్మం జైలు సూపరింటెండెంట్ సక్రు నాయక్, డాక్టర్ సతీష్ బాబు, క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ మంజుల, యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపి, సైకాలజిస్ట్ ఏ. నాగరాజు, డాక్టర్ టి. సృజన్ కుమార్, డీసీపీఓ విష్ణు వందన, ఏపీఏఐ అధ్యక్షుడు ఈ. వెంకటేశ్వర్లు, బి స్వాతి ఇన్ఫినిటీ సీడీసీ,బి. పవన్ కళ్యాణ్ ఫిజియోతెరపిస్ట్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ సమన్వయకర్తగా దాసరోజు శ్రీనివాస్ వ్యవహరించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యానికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం వంటి అంశాలు వ్యక్తుల మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయని తెలిపారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడంతోపాటు ఒత్తిడిని అధిగమించేందుకు సరైన అవగాహన, ఆత్మవిశ్వాసం, కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
మానసిక సమస్యలను బలహీనతగా భావించకుండా.. బాధితుల మనసును అర్థం చేసుకోవాలి. మానసిక ఇబ్బందులతో బాధపడుతున్నవారిని విమర్శించడం, కించపరచడం కాకుండా వారికి భరోసా కల్పించాలని వక్తలు సూచించారు. కొన్నిసార్లు సానుభూతితో వినే ఒక మనసు, ఆప్యాయంగా పలకరించే ఒక మాట, అండగా నిలిచే ఒక చేయి ఒక వ్యక్తి జీవితంలో ఎంతో మార్పును తీసుకురాగలవని వివరించారు.
మానసిక ఆరోగ్యంపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించి, బాధితుల పట్ల గౌరవం, సానుభూతి, సహకారం చూపడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. మానసిక సమస్యలు ఎదురైనప్పుడు వాటిని దాచిపెట్టకుండా, అవసరమైన సమయంలో మానసిక ఆరోగ్య నిపుణుల సలహాలు, వైద్య సహాయం తీసుకోవాలని సూచించారు.
మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులే కుటుంబానికి, సమాజానికి మరింత సమర్థవంతంగా సేవలందించగలరని తెలిపారు. మానసిక ఆరోగ్యం అనేది వ్యక్తిగత అంశం మాత్రమే కాదని, అది కుటుంబాల శ్రేయస్సుకు, సమాజ అభివృద్ధికి కూడా కీలకమని అభిప్రాయపడ్డారు.
“మానసిక ఆరోగ్యమే సంపూర్ణ ఆరోగ్యానికి పునాది.. వినడం మన బాధ్యత, అర్థం చేసుకోవడం మన మానవత్వం, అండగా నిలవడం మన సామాజిక బాధ్యత” అనే సందేశంతో ఈ కార్యక్రమం మానసిక ఆరోగ్య ప్రాధాన్యతను చాటిచెప్పింది.
ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన మానవతావాదులు, మానసిక ఆరోగ్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.