తీరొక్క పూలతో అలంకరించి ఆరాధించే పండుగ బతుకమ్మ... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
ఉత్సాహభరితంగా కలెక్టరేట్ లో అట్ల బతుకమ్మ వేడుకలు
కలెక్టరేట్ లో వివిధ శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలలో పాల్గొని గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేసిన జిల్లా కలెక్టర్
ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్ -14:
తీరొక్క పూలతో అలంకరించి పూలను పూజించి, ప్రకృతిని ఆరాధించే తెలంగాణ ఆడబిడ్డల పూల పండుగ మన బతుకమ్మ అని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు.
బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లో ఐదవ రోజు అట్ల బతుకమ్మ సందర్భంగా కలెక్టరేట్ లోని వివిధ శాఖల మహిళా అధికారులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకలలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ బతుకమ్మ వేడుకలలో కలెక్టరేట్లోని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, ఉద్యానవన శాఖ, జిల్లా విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్యాశాఖ, జిల్లా పరిశ్రమల శాఖ, జిల్లా పంచాయతీ శాఖ, జిల్లా పౌర సంబంధాల శాఖ, సహాయ సంచాలకులు (సర్వే మరియు భూ రికార్డులు), ఉపాధి శాఖ, ఖజానా శాఖ, ముఖ్య ప్రణాళికాధికారి కార్యాలయం, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ కార్యాలయం, జిల్లా సరఫరాల శాఖ, ఎస్డీసి, ఎస్సీ కార్పొరేషన్, గనుల శాఖ, కార్మిక శాఖ, గృహ నిర్మాణ శాఖ, పట్టణ ప్రణాళిక శాఖ తదితర అన్ని శాఖల మహిళా అధికారులు, మహిళా సిబ్బంది అంతా కలిసికట్టుగా పాల్గొన్నారు. ముందుగా గౌరమ్మ తల్లికి పసుపు, కుంకుమ, పూలతో జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా పూజించారు. అమ్మవారికి కొబ్బరికాయ, ప్రసాదాలు సమర్పించి, జిల్లా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు.
కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మలను పేర్చి వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ బతుకమ్మ ఆట పాటలతో సందడి చేసిన మహిళలు, ఉద్యోగులను కలెక్టర్ ఉత్తేజపరిచారు.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించుకుంటున్న బతుకమ్మ పండుగలో తొమ్మిది రోజులు రకరకాలుగా గౌరమ్మను కొలుచుకొంటూ, కలిసి కట్టుగా అందరూ ఒకేచోట చేరి ఆడుతూ, పాడుతూ బతుకమ్మను పూజించుకొంటారని కలెక్టర్ అన్నారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఐడీఓసీ ప్రాంగణంలో వివిధ రకాల రంగురంగుల పుష్పాలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. పూలతో ఆకర్షణీయంగా అలంకరించిన బతుకమ్మలు వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి. మహిళా ఉద్యోగులు భక్తిశ్రద్ధలతో బతుకమ్మకు పూజలు నిర్వహించి, పూలు సమర్పిస్తూ సంప్రదాయాలను పాటించారు.
ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మల చుట్టూ చేరి ఉత్సాహంగా ఆడిపాడారు. తెలంగాణ ఆడపడుచుల ఐక్యత, ఆత్మీయత, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా వేడుకలు కొనసాగాయి. వివిధ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు. పూల అలంకరణలు, సంప్రదాయ పాటలు, ఆటపాటలతో కలెక్టర్ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అందరూ బతుకమ్మ సంబరాలలో పాల్గొని గౌరమ్మను కొలిచి ఆట, పాటలతో సందడి చేసారు