క్యాబ్‌ల సమ్మె.. ప్రయాణికుల తిప్పలు!

శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్యాబ్ సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వ జీవో 46ను అమలు చేయాలంటూ సుమారు 25 వేల మంది డ్రైవర్లు సమ్మెకు దిగారు. ఓలా, ఉబెర్, రాపిడో ద్వారా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే రైడ్లను డ్రైవర్లు బహిష్కరించారు. జీవో ప్రకారం కిలోమీటర్‌కు రూ.21 రావాల్సి ఉండగా, ప్రస్తుతం రూ.12 నుంచి రూ.15 మాత్రమే చెల్లిస్తున్నారని డ్రైవర్ల యూనియన్ ఆరోపించింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి లిఖితపూర్వక హామీ ఇవ్వాలని డ్రైవర్లు కోరుతున్నారు. దీంతో ఎయిర్‌పోర్టుకు వచ్చే, అక్కడి నుంచి వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.