కేంద్రంలో సెప్టెంబర్‌లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయనే ప్రచారం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్త గవర్నర్ల నియామకాలు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు కూర్పులో మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి గవర్నర్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గతంలోనూ ఆయన పేరుతో ఇలాంటి ప్రచారం జరిగినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు.
మరోవైపు కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డికి బీజేపీ పార్లమెంటరీ బోర్డులో స్థానం కల్పించే అవకాశంపై కూడా చర్చ సాగుతోంది. కేంద్ర మంత్రివర్గంలో ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, వయసు పరంగా సీనియర్‌గా ఉన్న కొందరికి విశ్రాంతి ఇచ్చి యువ నాయకులకు అవకాశం కల్పించే అంశాన్ని కూడా అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన అనంతరం ఈ మార్పులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఎవరికి ఏ బాధ్యతలు దక్కుతాయన్నది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది.


