ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పేదలకు మరింత నాణ్యమైన బియ్యం అందించాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ 1 నుంచి 17 జిల్లాల్లో ఈ విధానం ప్రారంభమైంది.
కొత్త విధానంలో 10 శాతం నూకలు ఉండే బియ్యాన్ని ప్రత్యేకంగా ప్యాక్ చేసి లబ్ధిదారులకు అందిస్తున్నారు. బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేయడంతో సరఫరా వ్యవస్థను మరింత పారదర్శకంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. ఏపీ ప్రభుత్వం బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్లను ఉపయోగిస్తున్నట్లు గతంలోనూ సమాచారం వెలువడింది.
ప్రస్తుతం 17 జిల్లాల్లో అమలవుతున్న ఈ పంపిణీని వచ్చే నెలలో మరో మూడు జిల్లాలకు విస్తరించి మొత్తం 20 జిల్లాలకు తీసుకెళ్లాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి
రాష్ట్రవ్యాప్తంగా 29,844 రేషన్ దుకాణాల ద్వారా సుమారు 1.49 కోట్ల రేషన్ బియ్యం కార్డుదారులకు సరుకులు అందుతున్నాయి. ప్రతి నెల దాదాపు 2.31 లక్షల టన్నుల రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.
నాణ్యమైన బియ్యం అందించడంతో పాటు బియ్యం సరఫరాలో పారదర్శకత పెంచేందుకు క్యూఆర్ కోడ్ విధానం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.


