సూర్యాపేట,సెప్టెంబర్ 10;శాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలను జరుపుకోవాలని అనంతగిరి ఎస్ఐ ఏడుకొండలు సూచించారు.గురువారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో వినాయక మండపాల నిర్వాహకులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మండపానికి పోలీసు అనుమతి తప్పనిసరని,విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.డీజేలకు అనుమతి లేదని,నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకుంటూ పోలీసు శాఖకు సహకరించాలని,అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ముందుగానే రూట్ మ్యాప్ తయారు చేసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా పలువురు మండప నిర్వాహకులు,వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా,భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తామని,పోలీసు శాఖకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు.శాంతిభద్రతలకు భంగం కలగకుండా చూసుకుంటామని,యువతను చైతన్యపరిచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.మత సామరస్యాన్ని కాపాడుతూ అందరూ కలిసి పండుగను విజయవంతం చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు,పోలీసు సిబ్బంది,మండలంలోని వివిధ గ్రామాల వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.