రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట్ మండలం మెట్టుగడ్డ తండాకు చెందిన కుటుంబ సభ్యులు వినాయక నిమజ్జనం కార్యక్రమం ముగించుకుని ఇన్నోవాలో తిరుగు ప్రయాణమయ్యారు. పాలమాకుల గ్రామ సమీపంలోకి రాగానే కారు ప్రమాదానికి గురైంది.ఈ ఘటనలో కేతావత్ లింబ్యా (54), ఆయన భార్య జమున (45), కాట్రావత్ మాన్సింగ్ (48), కేతావత్ వశ్రామ్ (45) అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు వ్యాపారులు కాగా, జమున గృహిణిగా పోలీసులు తెలిపారు.కారు నడుపుతున్న సబావత్ అశోక్ తీవ్రంగా గాయపడ్డారు. అతడిని శంషాబాద్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు.