సజీవ దహనమైన వ్యక్తి.. గుర్తింపు కోసం పోలీసుల దర్యాప్తు
సూర్యాపేట: సూర్యాపేట మండలం పిల్లలమర్రి ఫ్లైఓవర్ సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం–హైదరాబాద్ జాతీయ రహదారి 365బీపై వెళ్తున్న వోల్వో కారు డివైడర్ను ఢీకొని మంటల్లో పూర్తిగా దగ్ధమైంది.ఉదయం 7.15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కారులో ఉన్న వ్యక్తి మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. కారు నంబర్ ప్లేట్ సైతం కాలిపోవడంతో వాహనం, మృతుడి వివరాలు గుర్తించడం కష్టంగా మారింది.సూర్యాపేట రూరల్ ఎస్ఐ ఎం. అనిల్ కుమార్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు, కారు ఏ ప్రాంతం నుంచి వచ్చిందనే విషయాన్ని తెలుసుకునేందుకు సమీప టోల్ ప్లాజాల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.