2.73 లక్షల మంది అభ్యర్థులు.. 340 నగరాల్లో 1,300 పరీక్షా కేంద్రాలు
దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పీజీ సీట్ల భర్తీ కోసం నిర్వహించే NEET PG 2026 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగస్టు 30న దేశంలోని 340 నగరాల్లో 1,300 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఈసారి 2.73 లక్షల మందికి పైగా వైద్య గ్రాడ్యుయేట్లు పరీక్షకు హాజరుకానున్నారు.
పరీక్ష నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఈ పరీక్ష ద్వారా దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఎండీ, ఎంఎస్ తదితర పీజీ వైద్య కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. గతేడాదితో పోలిస్తే ఈసారి దరఖాస్తుదారుల సంఖ్య 12.5 శాతం పెరిగింది. పరీక్ష ఒకే షిఫ్టులో జరగనుంది.
ప్రశ్నపత్రం లీక్ వదంతులు నమ్మొద్దు
సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న ప్రశ్నపత్రం లీక్ వదంతులను అభ్యర్థులు నమ్మవద్దని మంత్రి జేపీ నడ్డా సూచించారు. పరీక్ష ప్రారంభానికి కొద్దిసేపటి ముందు అత్యంత భద్రతతో తుది ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేస్తామని తెలిపారు. ప్రశ్నపత్రం ముందుగానే తమకు లభించిందని ఎవరైనా చెబితే అది మోసపూరిత ప్రచారమేనని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
కట్టుదిట్టమైన భద్రత
పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, సిగ్నల్ జ్యామర్లు, డైనమిక్ కంప్యూటర్ కేటాయింపు వంటి చర్యలు చేపట్టారు. సెంట్రల్, రీజినల్ కమాండ్ సెంటర్ల ద్వారా పరీక్షను ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం 60 వేల మందికి పైగా సిబ్బందిని నియమించారు.
విద్యార్థులకు కొత్త సౌకర్యాలు
అభ్యర్థులు తమ సొంత రాష్ట్రంతో పాటు మరో రెండు రాష్ట్రాలను పరీక్షా కేంద్రాల ఎంపిక కోసం ఎంచుకునే అవకాశం కల్పించారు. పరీక్ష నగర వివరాలను ముందుగానే తెలియజేయడంతో ప్రయాణ ఏర్పాట్లకు సమయం లభించింది. ఈసారి 210 నిమిషాల్లో 180 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్తో పాటు పరీక్ష సమయంలో ఆధార్ ఆధారిత గుర్తింపు తప్పనిసరి చేశారు. వేలిముద్రలు సరిపోని సందర్భాల్లో ఐరిస్ ఆధారిత బయోమెట్రిక్ వెరిఫికేషన్ను ప్రత్యామ్నాయంగా ఉపయోగించనున్నారు.


