పచ్చ కండువా తిప్పుతూ ప్రజలకు అభివాదం.. కేరింతలతో మార్మోగిన సభా ప్రాంగణం
మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను జాతికి అంకితం చేసిన సందర్భంగా సీఎం చంద్రబాబు సభలో ఉత్సాహంగా కనిపించారు. వెలిగొండ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదికపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్పై ఆయన నడుస్తూ ప్రజలను ఉత్సాహపరిచారు.
చేతిలోని పచ్చ కండువాను గాల్లో తిప్పుతూ సభకు హాజరైన రైతులు, ప్రజలకు అభివాదం చేశారు. చంద్రబాబు ఉత్సాహాన్ని చూసిన టీడీపీ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున కేరింతలు, చప్పట్లతో స్పందించారు. పలువురు తమ పచ్చ కండువాలను ఊపుతూ ఆయనతో కలిసి సందడి చేశారు.
మూడు దశాబ్దాల తర్వాత నెరవేరిన కల
ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభంతో చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
1996లో తానే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని గుర్తుచేసుకున్న సీఎం.. మూడు దశాబ్దాల తర్వాత దాన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం సంతృప్తినిచ్చిందన్నారు. వెలిగొండ ప్రాజెక్టు కరవు ప్రాంతాల తలరాత మార్చే ప్రాజెక్టుగా నిలుస్తుందని పేర్కొన్నారు.
లక్షల ఎకరాలకు సాగునీరు
శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను గ్రావిటీ ద్వారా నల్లమల సాగర్కు తరలించడం వెలిగొండ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. తొలి దశలో 10.70 టీఎంసీల నీటిని విడుదల చేయడం ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందించనున్నారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుందని అధికారులు తెలిపారు.
ప్రాజెక్టు పూర్తవడంతో స్థానిక రైతులు, ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సభలో చంద్రబాబు ప్రదర్శించిన ఉత్సాహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


